TIGER IN AMRABAD FOREST: నల్లమలలో పర్యాటకులకు మరోసారి పెద్దపులి కనిపించింది. పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు కనిపించటంతో పర్యాటకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. సహజంగా సిగ్గరి అయిన పెద్దపులి అలజడికి దూరంగా ఉంటూ ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటుంది. పులులు సుమారు 25 చదరపు కిలోమీటర్ల పరిధిని తమ ఆవాసంగా ఏర్పరచుకుని ఆ ప్రాంతోలోనే తిరుగుతూ ఉంటాయి. అటవీ ప్రాంతంలో తనకు మాత్రమే సంబంధించిన ప్రత్యేక ప్రదేశంలో పులులు తిరుగాడుతూ తన పరిధిలోకి వచ్చే జంతువులపై దాడి చేస్తూ ఉంటాయి. అమ్రాబాద్ పెద్దపులుల అభయారణ్యం (AMRABAD TIGER RESERVE)లో 34 పెద్దపులులున్నట్లు ఎన్‌టీసీఏ ఇటీవల విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది.
10 రోజుల్లో రెండోసారి:అమ్రాబాద్ పెద్దపులుల అభయారణ్యంలో ప్రకృతి ప్రియులు, పర్యాటకుల కోసం అటవీ శాఖ సఫారీ సందర్శన ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే వారి కోసం స్పెషల్ ప్యాకేజి ఉండగా, శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న ఫర్హాబాద్ గేట్ నుంచి వ్యూ పాయింట్ వరకు సుమారు 9 కిలోమీటర్లు అడవిలో వెళ్లి వచ్చే ప్యాకేజీ మరొకటి ఉంది. పర్యాటకులను అటవీశాఖ ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్తారు. సఫారీ రైడ్‌లో పర్యాటకులకు జింకలు, దుప్పులు, కోతులు, ఎలుగుబంట్లు, చిరుత పులులు కనిపిస్తాయి.
శనివారం ఫర్హా మనమరాలు కనిపించింది: అయితే పెద్దపులి మాత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో గుండం బేస్ క్యాంపు పరిసరాల్లో ఈ నెల 18వ తేదీన సఫారీలోని పర్యాటకులకు ఏటీఆర్ మగ పులి (M19) కనిపించింది. తాజాగా 28వ తేదీ శనివారం ఫర్హాబాద్ సమీపంలోని సఫారీ మార్గంలో మరో ఆడపులి ఫర్హా మనమరాలు F38 కనిపించింది. దీంతో చిన్నారులు, యువత సంతోషంతో కేరింతలు కొట్టారు. 10 రోజుల్లోనూ రెండు పెద్ద పులులు కనిపించడంతో పర్యాటకులు సఫారీ ప్రయాణానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పులులు ఒకే ప్రాంతంలో కనిపిస్తుండటంతో ఇవి జతకలిసేందుకు వచ్చి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో మన్ననూర్ నుంచి ఫరహాబాద్ వ్యూ పాయింట్ వరకు 25 కిలోమీటర్లు, గుండం (బేస్ క్యాంపు) నుంచి దట్టమైన అడవిలోకి 35 కిలో మీటర్లు మేర సఫారీ రైడ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆన్‌లైన్‌లో రూ.5,100 నుంచి రూ.8,500 వరకు టికెట్స్‌ను బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఏడుగురు పర్యాటకులు, గైడ్, డ్రైవర్‌తో కలిసి సఫారీ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. సుమారు నెలకు 200 నుంచి 300 మంది వరకు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుని సఫారీ రైడ్‌కి వస్తుంటారని అధికారులు చెబుతున్నారు.