Ratnalayam Temple Robbery Case: దేవాలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.70లక్షల విలువ చేసే బంగారు, పంచలోహ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :శామీర్‌పేట్ మండలం అలియాబాద్ గ్రామ శివారు రాజీవ్ రహదారి పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి(రత్నాలయం)లో ఈ నెల 24న అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. దేవాలయం వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించి విలువైన బంగారం, వెండి, కాంస్య విగ్రహాలను ఎత్తుకెళ్లారు. దీనిఫై పోలీసులకు ఫిర్యాదు అందింది.
కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు శామీర్‌పేట్, జీనోమ్ వ్యాలీ, ఎస్ఓటీ, సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. దాదాపు 400 సీసీ కెమెరాల ఫుటేజీలను తనిఖీ చేశారు. దుండగులు ఓ రోజు రాత్రంతా వాహనాలపై తిరుగుతూ తెల్లవారుజామున ఒకచోట అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు.
మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయకు చెందిన అనిల్, మేడ్చల్ పట్టణానికి చెందిన చింతాడ రాజు, రాంనగర్ చెందిన అస్లాం అలీ, షరీఫ్‌లకు ఈ చోరీతో సంబంధం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరిలో అనిల్, రాజు దేవాలయంలో చోరీ చేసిన వస్తువులను అస్లాం, షరీఫ్‌లకు అమ్మారు. వారిపై నిఘా పెట్టిన పోలీసులు మేడ్చల్ మండలం మున్షీరాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.