Tenectase injection for Heart Disease : ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన విధానాలతో వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడితో ఇటీవల కాలంలో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చు. కానీ ఈ విధంగా చికిత్స అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధులకు చికిత్సలు అందించేందుకు అవసరమైన సూది మందు టెనెక్టిప్లెస్ ఉందని ఎంత మందికి తెలుసు? ఈ విషయం ఎవరికీ తెలియక చాలా మంది ప్రైవేట్ బాట పట్టి జేబులను గుళ్ల చేసుకుంటున్నారు.
గుండె జబ్బుకు తొలి గంట ఎంతో ముఖ్యం : గుండెపోటుకు గురైన వారిని కాపాడేందుకు తొలిగంటలో అందించే చికిత్స ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్నే 'గోల్డెన్ అవర్' అంటారు. ఈ గోల్డెన్ అవర్‌లోనే టెనెక్టిప్లెస్ అనే సూది మందును ఇస్తారు. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న సూది మందు. దీని విలువ ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.45 వేల వరకు ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ఇది పూర్తిగా ఉచితం. ప్రస్తుతం రాష్ట్రంలో నిజామాబాద్, కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నారు. కానీ చాలా మందికి దీనిపై అవగాహన లేకపోవడంతో ఆదరణ కరవైంది.
టెనెక్టిప్లెస్ సూది మందును ఎలా ఇస్తారు, ఉపయోగం :
- ముందుగా ట్రైకాగ్ ఈసీజీ యంత్రం సాయంతో రోగికి పరీక్షలు నిర్వహిస్తారు.
- తర్వాత వైద్యుల ప్రొటోకాల్ నిబంధనలకు అనుగుణంగా రోగికి టెనెక్టిప్లెస్ సూది మందును ఇస్తారు.
- ఈ సూది మందును రెండు రకాలు ఇస్తారు. అవి ఇంజక్షన్, సెలైన్ రూపంలో
- దీనివల్ల గుండెపోటు వచ్చిన వారికి రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది.
- ఇది గుండెలో రంధ్రాలను శుభ్రం చేస్తుంది.
- అలాగే రక్తం సరఫరా చేసేందుకు సహాయపడే రక్తనాళాలు కుచించుకుపోకుండా చేస్తుంది.
- ప్రాథమికంగా కోలుకున్న రోగికి మెరుగైన చికిత్స అందించేందుకు వీలవుతుంది.