Telugu Residents Working in Top Mining Department in India :ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. ఇది లేకపోతే దేశమంతా అంధకారంలో చిక్కుకుంటుంది. ఇంత కీలక ఇంధన వనరులను దేశానికి అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల అధిపతుల్లో ప్రస్తుతం అత్యధికులు తెలుగు వారే. దేశ చరిత్రలోనే తొలిసారి కీలకమైన బొగ్గు శాఖ పదవుల్లో ఎక్కువమంది తెలుగు రాష్ట్రాల వారున్నారు. ప్రస్తుతం వారి సారథ్యంలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ బొగ్గు శాఖ అభివృద్ధి చెందుతోంది.
నిర్దేశిత బొగ్గు, విద్యుదుత్పత్తి లక్ష్యాలు సాధించడంలో, గణనీయమైన లాభాలు, టర్నోవర్ గడించడంలోనూ ప్రశంసనీయ ప్రగతి సాధించడానికి వారి ప్రతిభా పాటవాలే ముఖ్య కారణం. ఆసియాలోనే అతి పెద్దదైన కోల్ ఇండియా సంస్థతో పాటు, దాని అనుబంధ సంస్థలైన నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(ఎన్‌సీఎల్), సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్) సీఎండీలు తెలుగు రాష్ట్రాలకు చెందిన మైనింగ్ ఇంజినీర్లే ఉన్నారు.
దక్షిణ భారత దేశంలో వెలుగులు నింపుతున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌తో పాటు తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీ) సీఎండీలు కూడా మన తెలుగు తేజాలే. దేశంలో బొగ్గు రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలన్నింటిలోనూ కీలకపాత్ర పోషించే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మద్దిరాల నాగరాజు కూడా మన తెలుగువారే.
ప్రపంచాన్నే శాసిస్తున్న నల్ల బంగారం! ఎందుకింత ప్రాధాన్యం?
దేశంలో మహారత్న కంపెనీలలో అగ్రస్థానంలో నిలుస్తున్న కోల్ ఇండియా లిమిటెడ్ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దేశంలో వినియోగిస్తున్న 90 శాతం బొగ్గు కోల్ ఇండియాకు చెందిన గనుల్లోనే ఉత్పత్తవుతోంది. ప్రపంచంలోని ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలలో ఒకటైన కోల్ ఇండియా లిమిటెడ్‌కు పి.ఎం.ప్రసాద్ 2023 జులై నుంచి సీఎండీగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన వారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లో ఎంటెక్ చదివారు. మహానది కోల్ ఫీల్డ్స్‌లో జనరల్ మేనేజర్‌గా ఆయన బాధ్యతలు మొదలయ్యాయి. ఆయన నేతృత్వంలో కోల్ ఇండియా సంస్థ చరిత్రలోనే అత్యధికంగా గతేడాది(2023-24)లో 773.64 మి.ట బొగ్గు ఉత్పత్తి చేసింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10.02% అధికం. గత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో టర్నోవర్‌ను, లాభాలను కూడా సాధించింది.
సింగరేణిలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహబూబ్‌నగర్ వాసి : ప్రస్తుతం సింగరేణి సీఎండీగా ఉన్న ఎన్.బలరాం గత ఐదేళ్లుగా ఫైనాన్స్ డైరెక్టర్ హోదాలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆయన ఉన్నత చదువులను పూర్తి చేసిన ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్)కు ఎంపికయ్యారు. ఈ సంస్థలో డైరెక్టర్-పర్సనల్, డైరెక్టర్- ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ బాధ్యతలను నిర్వర్తించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం బలరాం కృషిని, చొరవను గుర్తించి సీఎండీ బాధ్యతలు అప్పజెప్పింది.
బలరాం సారథ్యంలో సింగరేణి వ్యాపార విస్తరణ చర్యల్లో వేగంగా ముందుకు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న 1,200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌కు అదనంగా 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా నడుస్తోంది. సౌరవిద్యుత్ రంగంలోనూ ప్రస్తుతం ఉన్న 235 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యాన్ని వెయ్యి మెగావాట్లకు పెంచేందుకు బలరాం చర్యలు చేపడుతున్నారు. పర్యావరణ ప్రేమికుడిగా పేరున్న ఆయన స్వయంగా 18 వేల మొక్కలు నాటి అందరిలోనూ పర్యావరణ స్ఫూర్తిని నింపారు.
భద్రాచలం నుంచి నైవేలీ లిగ్నైట్‌కు :నైవేలీ లిగ్నైట్ సీఎండీగా ఉన్న మోటుపల్లి ప్రసన్న కుమార్‌ది భద్రాచలం. 1988లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఎన్టీపీసీలో చేరిన ఆయన 34 సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానంలో ప్రొఫెషనల్ మేనేజర్‌గా, స్ట్రాటజిక్ ప్లానర్‌గా, బిజినెస్ లీడర్‌గా పేరొందారు. 2023 జనవరి 12 నుంచి నవరత్న కంపెనీ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌కు సీఎండీగా బాధ్యతలు నిర్విహిస్తూ థర్మల్, సౌరవిద్యుత్ ఉత్పత్తిలో ప్రగతి సాధించారు. నైవేలీ సంస్థ నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా ఏడాదికి 4,300 మెగావాట్లు దేశ ఇంధన అవసరాలకు ఉపయోగపడుతోంది. అలాగే 1,400 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు కూడా ఉన్నాయి.
నల్గొండ నుంచి సీసీఎల్‌కు :సెంట్రల్ కోల్ ఫీల్డ్స్(సీసీఎల్) సీఎండీగా ఉన్న డాక్టర్ బి.వీరారెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన వారు. మైనింగ్ ప్లానింగ్‌లో ఎంటెక్, పీహెచ్‌డీ చదివారు. సింగరేణి సంస్థలో పలు బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆసియాలోనే అతి పెద్దదైన అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టుకు జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన నిబద్ధతని గుర్తించి కేంద్రం ఆయనను కోల్ ఇండియా లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్‌గా అపాయింట్ చేసింది. తర్వాత కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ బొగ్గు సంస్థ అయిన సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌కు సీఎండీగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది.
వైజాగ్ టూ ఎన్‌సీఎల్‌కు :నార్తర్న్ కోల్ ఫీల్డ్స్(ఎన్‌సీఎల్) సీఎండీగా ఉన్న బి.సాయిరాంది విశాఖపట్నం. రాయపుర్ ఎన్‌ఐటీ నుంచి మైనింగ్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ పట్టా పొందారు. వివిధ హోదాల్లో సమర్థంగా పనిచేసిన ఆయన సీసీఎల్‌లో డైరెక్టర్ టెక్నికల్‌గా సేవలందించారు. పర్యావరణ పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కోల్ ఇండియాలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి భాగస్వామ్య సంస్థగా ఉన్న నార్తర్న్ కోల్ ఫీల్డ్స్‌కు సీఎండీగా నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో గతేడాది 136.15 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ఇది అంతకు ముందు ఏడాది ఉత్పత్తి కన్నా 3.08 శాతం అధికం.
ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కేంద్రానికి వయా త్రిపుర :కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న మద్దిరాల నాగరాజు త్రిపుర రాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ అధికారిగా అక్కడ పలు శాఖల్లో సేవలందించారు. ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లా వాసి. కేంద్ర ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ డైరెక్టర్‌గా జపాన్, ఉత్తర అమెరికాలో బాధ్యతలు నిర్వహించారు. 2008 నుంచి 2012 వరకు వాషింగ్టన్‌లో ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు సలహాదారుగా పని చేశారు. 2020 జనవరి 30 నుంచి భారత బొగ్గు మంత్రిత్వ శాఖలో సేవలందిస్తున్న ఆయన బొగ్గు పరిశ్రమ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.
APMDC : ఏపిఎండిసి ద్వారా ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి -విసిఎండి వెంకటరెడ్డి