Special pujas in Singapore :హిందూ ధర్మశాస్త్రాల్లో కార్తికమాసానికి ఓ ప్రత్యేకమైన సముచిత స్థానం ఉంది. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా ఈ కార్తికమాసం విశిష్టతను సంతరించుకుంది. దీని ప్రాముఖ్యతను గురించి సుప్రసిద్ధ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు పలుమార్లు ప్రస్తావించడం గమనార్హం. ఈ పవిత్ర మాసంలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. అయితే భారతదేశంలో విధిగా భక్తులు నిష్టతో నిర్వహించే ఈ క్రతువుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ సైతం ఆచరించడం విశేషం.
సింగపూర్ లో కార్తిక శోభ: కార్తికమాసాన్ని పురస్కరించుకుని సింగపూర్ లో ఉన్న తెలుగు సమాజం ఆధ్వర్యంలో నిష్టతో, నియమ నిబంధనలతో మహా త్రిపురసుందరీ సమేత ఉమా సహస్ర లింగార్చన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దీనితో పాటు హరిద్రా కుంకుమార్చన సహిత లక్ష బిల్వార్చన సైతం నిర్వహించారు.
తెలుగు బ్రాహ్మణ రుత్వికుల ఆధ్వర్యంలో అర్చన: భక్తి శ్రద్ధలతో అర్చనను చేసేందుకు దాదాపుగా 50 మంది తెలుగు బ్రాహ్మణ రుత్వికులు హాజరయ్యారు. దీంతో పాటు సింగపూర్ లిటిల్ ఇండియాలోని ఆర్య సమాజ్ ప్రాంగణములో సుమారు 12 గంటలకు పైగా ఈ అర్చన నిర్వహించడం విశేషం. గణపతి పూజ పుణ్యాహవచనం తో మొదలుకొని మృత్తికా శోధన కార్యక్రమంతో మహాన్యాసా పూర్వకంగా భారతదేశం నుంచి తెప్పించిన శ్రేష్ఠమైన పుట్టమన్నుతో 1,136 శివ లింగములు చేసి వాటిని సమంత్ర పూర్వకంగా మూల మంత్రంతో అర్చన చేశారు. ఆ తరువాత అరుణపారాయణం నిర్వహించారు.