Telangana Yasangi Grain Sales : రాష్ట్రంలో యాసంగిధాన్యం (Yasangi Grain) తాజా టెండర్లతో పౌరసరఫరాల శాఖకు రూ.1110.51 కోట్ల లాభం వచ్చింది. ప్రభుత్వం చొరవతో భారీగా రాబడి లభించింది. గతేడాది అకాల వర్షాల ప్రభావంతో తడిచిన ధాన్యం విక్రయాల్లో పౌరసరఫరాల శాఖకు రూ.1000 కోట్ల పైగా నష్టం వాటిల్లేలా ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నించిందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.3000లకు పైగా తక్కువకు టెండర్ కొటేషన్ కట్టబెట్టినా కొనుగోలుదారులు ఆ మొత్తం కూడా చెల్లించేందుకు ఇష్టపడలేదని తెలిపింది.
Telangana Govt Profit Above Six Thousand Crores : అనంతరం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేశారని సర్కార్ తెలిపింది. తాజాగా పిలిచిన టెండర్లలో గతం కన్నా ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.3000లు అదనంగా టెండర్లు దాఖలయ్యాయని పేర్కొంది. ఈ లెక్కన పౌరసరఫరాల శాఖకు రూ.1110.51 కోట్లు అదనంగా సమకూరనుందని వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఓ ప్రకటన విడుదల చేసింది.
'సాధారణ బియ్యం ఎంతైనా తీసుకుంటాం'
కనీస మద్దతు ధర - ఎమ్మెస్పీ ప్రకారం మెట్రిక్ టన్ను ధాన్యం ధర రూ.20,600 అని ప్రభుత్వం వివరించింది. గత బీఆర్ఎస్ హయాంలో టెండర్లు పిలిచి మెట్రిక్ టన్నుకు రూ.17,015.19ల చొప్పున టెండర్లు ఖరారు చేశారని తెలిపింది. ఆ లెక్కన 34.59 లక్షల మెట్రిక్ టన్నులకు పౌరసరఫరాల శాఖకు రూ.5885.55 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంది. అయితే ఎమ్మెస్పీ ప్రకారం చూస్తే రూ.1239.99 కోట్లు నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమైందని వెల్లడించింది. అందుకే అంత తక్కువకే ధాన్యం టెండర్లు దక్కించుకున్న కొనుగోలుదారులు ఆ మొత్తం సొమ్ము చెల్లించేందుకూ ముందుకు రాలేదని సర్కార్ వెల్లడించింది.