Galleria 2025 in Hyderabad : తెలంగాణ ఫొటోగ్రాఫిక్ సొసైటీ తన 5 రోజుల వార్షిక ప్రదర్శన ‘గ్యాలరియా 2025’ను మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌లో నిర్వహిస్తోంది. ఈ ప్రదర్శన శుక్రవారం (ఫిబ్రవరి 7న) సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని సొసైటీ తెలిపింది. సొసైటీ సభ్యులు సంగ్రహించిన అద్భుతమైన ఛాయా చిత్రాలు గ్యాలరియా 2025లో ప్రదర్శించబడతాయని తెలిపారు.
అభిరుచిని రగిలించి వెలికితీయడమే : ఈ గ్యాలరియా 2025 ప్రదర్శన ప్రధాన లక్ష్యం కేవలం ఫొటోగ్రఫీ కళను ప్రదర్శించడమే కాకుండా, యువ ఔత్సాహికులలో ఫొటోగ్రఫీ అభిరుచిని రగిలించే ప్రక్రియ కూడా అని సొసైటీ నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ సంప్రదాయానికి అనుగుణంగా ’గ్యాలరియా 2025’లో వన్యప్రాణులు, ప్రకృతి, ప్రకృతి దృశ్యం, ట్రావెలింగ్, వీధి, పోర్ట్రెయిట్, ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్ ఫొటోగ్రఫీ వంటి అనేక రకాల చిత్రాల శైలులను కవర్ చేసే 40 మంది ఫొటోగ్రాఫర్‌ల కృషిని కలిగి ఉందని పేర్కొన్నారు. అదనంగా భారతదేశంలోని ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ల ద్వారా ఇలస్ట్రేటెడ్ చర్చలు, వర్క్‌షాప్‌లు ఉంటాయని తెలిపారు. అందరికీ అన్ని ఈవెంట్‌లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.