Telangana Highcourt on Water Issue : రాష్ట్రం, జంట నగరాల్లో నీటి కొరతపై తగిన చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సీఆర్ సుభాశ్ చంద్రన్ 2005లో రాసిన లేఖను హైకోర్టు అప్పట్లోనే పిటిషన్ గా స్వీకరించింది. దీనిపై పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. గతంలో ఇదే న్యాయస్థానం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లతోపాటు కోర్టు సహాయకుడిగా నియమితులైన సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుంది.
Telangana HC On Water Preservation : నీటి సంరక్షణకు పలు చర్యలు చేపట్టాల్సి ఉందని సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి హైకోర్టుకు (Telangana Highcourt) తెలిపారు. పిటిషన్ దాఖలైనప్పటి తీవ్ర పరిస్థితులు ప్రస్తుతం లేవని అయితే అప్రమత్తత అవసరమని సూచించారు. భవిష్యత్‌లో నీటి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలన్నింటినీ తనిఖీలు నిర్వహించి ఇంకుడు గుంతల ఏర్పాటును పరిశీలించాలని ధర్మాసనానికి వివరించారు.
నీటిని తిరిగి వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని ప్రకాశ్‌రెడ్డి న్యాయస్థానానికి వివరించారు. బోర్ల తవ్వకాల్లో వాల్టా చట్టం నిబంధనలు అమలయ్యేలా చూడాలని కోరారు. భూమిలో నీటిమట్టం ఏ స్థాయిల్లో ఉందో ఒకసారి అధ్యయనం చేయాలని దాని పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. నీటి సంరక్షణ, వృథా నివారణపై పిల్లల్లో చైతన్యం తీసుకువచ్చేలా పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలని తెలిపారు.
బెంగుళూరు దుస్థితికి మనం దగ్గరలోనే ఉన్నామా?
నివేదికలోని అంశాలపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్పందిస్తూ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదనగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నీరు అనేది ప్రజలకు సంబంధించిన సమస్య అని, దానిపై సర్కార్ వ్యతిరేక ధోరణిలో మాట్లాడం సరైంది కాదని తెలిపింది. అమికస్ క్యూరీ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వచ్చి అన్నింటినీ అమలు చేస్తామని చెప్పాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా సమాధానం వస్తోందని వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు తాము అదేశాలు జారీ చేస్తామని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. తాము జారీ చేసే ఆదేశాల అమలుపై వివరణ తీసుకుని నివేదికను సమర్పించాలని అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్‌కు ధర్మాసనం సూచించింది.