TG Govt Focus On Skill University :రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకానుంది. ఈనెల 23 నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చట్టం రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి రాష్ట్ర పరిశ్రమల శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. దిల్లీ, హరియాణాలో స్కిల్ యూనివర్సిటీలను పరిశీలించిన పరిశ్రమల శాఖ ఆ తరహాలో రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపనకు ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది.
పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యంతో :ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో స్కిల్స్ యూనివర్సిటీని నెలకొల్పనున్నారు. లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తి ఉండేలా దీనిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, 3 నుంచి 4 నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఇందులో అందుబాటులో ఉండనున్నాయి.
17 కోర్సుల్లో నైపుణ్య శిక్షణ :రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోర్సులను ఎంపిక చేసి 17 రంగాలకు చెందిన కొత్త కోర్సులను బోధించాలని నిర్ణయించారు. మొదట ఫార్మా, కన్‌స్ట్రక్షన్, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఈ-కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు.
తొలి ఏడాది 2 వేల మందికి శిక్షణ :ప్రతి కోర్సును ఆ రంగంలో పేరొందిన ఒక ప్రముఖ కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. ప్రభుత్వం ఆయా కంపెనీలతో అవగాహన ఒప్పందం చేసుకుంటుంది. తొలి ఏడాది 2 వేల మందితో ప్రారంభించి క్రమంగా ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ క్యాంపస్‌లో ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. భవిష్యత్తులో అవసరమైతే జిల్లా కేంద్రాల్లోనూ శాటిలైట్ క్యాంపస్‌లు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది.
CM Review On Skill University :తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులు, అవసరమయ్యే మౌలిక వసతులు, నిధులు, కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.