Govt Issued Orders On Comprehensive Caste Census :రాష్ట్రంలో సమగ్ర కుల గణనపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుల గణన చేసే బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగిస్తూ అరవై రోజుల్లో సర్వే పూర్తి చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నట్లు జీవోలో ప్రభుత్వం తెలిపింది. సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే చేయాలని ఆదేశించింది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన వర్గాల అభివృద్ధి కోసం సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు చేసేందుకు సర్వే చేయనున్నట్లు తెలిపింది. ఈ సర్వే ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై ఇప్పటికే కమిటీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు.
వీలైనంత వేగంగా కులగణన పూర్తి చేయాలి :బీసీ కులగణనను 60 రోజుల్లో పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ కులగణన పూర్తయితే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వీలైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ సామాజిక, ఆర్థిక కులసర్వేపై బిహార్, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలు అనుసరించిన విధానాలపై తాజాగా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.