Govt Employees Transfers In Telangana : రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నెలకొన్న సందేహాలను ఆర్థిక శాఖ నివృత్తి చేసింది. ఒకేచోట నాలుగేళ్ల నుంచి పనిచేసినవారందరికీ బదిలీ ఉంటుందని భార్యాభర్తలున్నా తప్పనిసరిగా స్థానచలనం చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. అలా మార్చినప్పుడు కొత్తచోట దగ్గరగా ఉండేలా వారికి పోస్టింగ్ ఉండాలని పేర్కొంది.
ప్రస్తుతం నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసిన భార్యాభర్తలుంటే వారిని బదిలీ చేయాలని పేర్కొంది. స్పౌజ్ కేస్ నిబంధన కింద చాలా మంది ఉద్యోగ దంపతుల్లో ఒకరు నగరంలో, మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా జీవిత భాగస్వామి నగరంలో పనిచేస్తున్నందున తమను అక్కడికే బదిలీ చేయాలని గట్టిగా అడుగుతున్నారు. అలా అడిగేవారిని కచ్చితంగా నగరానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని ఆర్థికశాఖ స్పష్టతనిచ్చింది.
నగరంలో ఉన్నవారినే గ్రామీణ ప్రాంతానికి మార్చవచ్చని నిబంధనలు చెపుతున్నాయని ఆర్థికశాఖ తేటతెల్లం చేసింది. వేర్వేరు శాఖల్లోని ఉద్యోగ దంపతులు నగరంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారు సైతం స్పౌజ్ కేసు నిబంధనను అనుకూలంగా మార్చుకున్నారని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం వేర్వేరు శాఖల్లో పనిచేస్తున్నా ఇద్దరికీ నగరంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తైతే కచ్చితంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి.