Vehicles Scrappage Policy in Telangana : మీ దగ్గర పాత వాహనం ఉందా? దాన్ని మీరు 15 ఏళ్లు పైబడి వాడుతున్నారా? అయితే మీ జేబుకు చిల్లు పడాల్సిందే. ఎందుకంటే ఇలాంటి వాహనాలు వాడేటప్పుడు ఆయిల్ ఎక్కువగా తాగడం, తరచూ మరమ్మతులు, ఫిట్నెస్ సమస్యలు, తరచూ ప్రమాదాలు వంటివే కాకుండా గ్రీన్ ట్యాక్స్ పేరుతో రవాణా శాఖకు పన్ను కట్టాలి. పైగా మరో బండి కొంటే రిజిస్ట్రేషన్ సమయంలో జీవిత పన్ను కింద 2 శాతం పన్ను కట్టాల్సిందే. అయ్య బాబోయ్! ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా? వెంటనే అమ్మేద్దామని చూస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం పాత వాహనాల తుక్కు విధానంపై నూతన పాలసీని తీసుకువస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరగా, నేడో, రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఏముందంటే?
కాలం చెల్లిన వాహనాల్ని తుక్కు కింద మార్చే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో వాలంటరీ వెహికిల్ ఫ్లీట్ మోడ్రనైజేషన్ ప్రోగ్రాం/ వెహికిల్ స్క్రాప్ పాలసీని తీసుకొచ్చింది. వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ద్విచక్ర వాహనాలను తుక్కుగా మార్చితే జీవిత పన్నులో కనీసం రూ.1000 నుంచి రూ.6 నుంచి రూ.7 వేల వరకు రాయితీ ఇవ్వనున్నారు. అలాగే నాలుగు చక్రాల వాహనాలకు అయితే కనీసం రూ.15 వేలు గరిష్ఠంగా రూ.50 వేల వరకు రాయితీని ప్రతిపాదించినట్లు తెలిసింది.
నూతనంగా కొనుగోలు చేసే వాహనం విలువ ఆధారంగా ఈ రాయితీ మొత్తం ఉండనుందని రవాణాశాఖ వర్గాల సమాచారం. కొత్తగా కొనే వాహనం రవాణా అవసరాలకు వాడితే ప్రతి త్రైమాసికానికి చెల్లించే పన్నులో 10 శాతం చొప్పున ఎనిమిదేళ్ల పాటు రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించారు. అదే వ్యక్తిగత అవసరాలకు వాడేదైతే ఆన్ రోడ్ ప్రైస్‌లో తగ్గిస్తారు. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం వాహన తుక్కు విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో ఇప్పటికే ఏపీ, యూపీ, గుజరాత్, కర్ణాటకలు చేరి అమలు చేస్తున్నాయి. కాలం చెల్లిన ప్రైవేటు వాహనాల్ని తుక్కు కింద మార్చడం స్వచ్ఛందమే తప్ప నిర్బంధం కాదని రవాణా వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వాహనమైతే 15 ఏళ్లు దాటితే తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిందే.
మీ పాత వాహనాన్ని తుక్కుగా చేయాలంటే :ఉదాహరణకు బైక్ లేదంటే కారును 17 ఏళ్లుగా ఉపయోగిస్తున్నారనుకుంటే రెండేళ్లకు గ్రీన్ ట్యాక్స్ కట్టాలి. పాత బండిని స్క్రాప్ చేస్తే ఆ రెండేళ్ల పన్నుకు మినహాయింపు ఇస్తారు. అలాగే రవాణా వాహనాల త్రైమాసిక పన్ను చెల్లింపులో ఆలస్యమైతే జరిమానాను విధిస్తారు. మరలా పాత రవాణా వాహనాన్ని తుక్కుగా మారిస్తే ఆ జరిమానాకు మినహాయింపు ఉంటుంది. అప్పుడు కొత్త బండి కొనుగోలు చేసేటప్పుడు ఆ విలువపై నిర్ణీత రాయితీ ఉంటుంది.