Telangana on Advance Technology Centre for Employment :పరిశ్రమల అవసరాలకు, యువత నైపుణ్యాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించే విధంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా పదో తరగతి పూర్తి చేసిన వెంటనే పలు నైపుణ్య శిక్షణ కోర్సులు నేర్చుకునే విధంగా కొత్త ప్రణాళిక అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఐదు నెలల క్రితం మల్లేపల్లి ఐటీఐలో ఆధునిక సాంకేతిక కేంద్రాలు ప్రారంభించారు. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది.
ఏటీసీల అభివృద్ధికి మొత్తం 2,324 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో రాష్ట్రం రూ. 307 కోట్లు, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ రూ. 2వేల 16 కోట్లు కేటాయిస్తోంది. రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉండగా అందులో ఈ విద్యా సంవత్సరం నుంచి 25 ఐటీఐలు ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దారు. 6 కొత్త కోర్సులు ప్రారంభించారు. ఐటీఐలో ఉన్న కోర్సులు దాదాపు 3 దశాబ్దాల క్రితం రూపొందించారు. ఇప్పుడు యాంత్రీకరణ పెరిగింది. ఆధునిక పరిజ్ఞానంతో పరిశ్రమల్లో సులువుగా పనిచేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే యంత్రాలు ఆపరేట్ చేసే పరిజ్ఞానం యువతకు అందడం లేదు.
'మీరు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోటీ పడాలంటే సర్టిఫికెట్‌తోపాటు సాంకేతిక నైపుణ్యం ఉండాలి. అప్పుడే మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ కోర్సులో నైపుణ్యలు నేర్చుకుంటే సొంతంగా వ్యాపారం కూడా చేసుకోవచ్చు'- రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
నైపుణ్యాలు ఉంటే సులభంగా ఉద్యోగ అవకాశాలు :దీంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. సరైన నిపుణులు లేక పారిశ్రామిక రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నేటి అవసరాలకు తగిన విధంగా టాటా టెక్నాలజీ లిమిటెడ్‌తో కలిసి సాంకేతిక విద్యా ఉన్నతాధికారులు పాఠ్య ప్రణాళిక సిద్ధంచేశారు. 6 అధునాతన కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అడ్వాన్స్ సీఎన్‌సీ మెషినింగ్ టెక్నీషియన్, ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్‌డ్ టూల్, బేసిక్ డిజైనర్-వర్చువల్ వెరిఫయర్ (మెకానికల్), ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మెకానిక్- ఎలక్ట్రిక్ వెహికిల్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు.
ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తోపాటు ఇతర పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ఈ మేరకు వివిధ సాంకేతిక పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. శిక్షణకు 130 మంది నిపుణులను నియమించారు. ఈ కేంద్రాల్లో 15వేల మందికిపైగా విద్యార్థులకు 6 లాంగ్ టర్మ్ కోర్సులు, 31 వేల మందికిపైగా విద్యార్థులకు 23 రకాల షార్ట్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ అందిస్తారు. షార్ట్ టర్మ్ కోర్సులు ఇప్పటికే చెబుతున్నా అకాడమిక్ కోర్సులు మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధించనున్నారు. పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా విద్యార్థులు నైపుణ్యాలు అలవర్చుకుంటే సులభంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
'టాటాల ఎంట్రీతో ఇక్కడ చదివేవారి దశ తిరగబోతోంది!
'65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ - మల్లేపల్లి ఐటీఐలో శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ - CM Revanth lay Foundation for atcs