తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమగ్ర కులగణన అన్ని పథకాలకు మెగా హెల్త్​ చెకప్​లా ఉపయోగపడుతుంది'

సమగ్ర కులగణనకు ఏర్పాట్లు ముమ్మరం - ఇంటింటి కుటంబ సర్వేకోసం ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం - కులగణన భవిష్యత్​లో అన్ని పథకాలకు 'మెగా హెల్త్​ చెకప్​లా' ఉపయోగపడుతుందన్న మంత్రి పొన్నం

Comprehensive Caste Census
Comprehensive Caste Census (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2024, 8:47 PM IST

Comprehensive Caste Census :కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా మూడురోజులపాటు ఇళ్ల గుర్తింపు కార్యక్రమాన్ని పలు జిల్లాల్లో చేపట్టారు. సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 6 నుంచి జరగనున్న సమగ్ర కుల గణనలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. భవిష్యత్తులో అన్ని పథకాలకు ఈసర్వే మెగా హెల్త్ చెకప్‌లా ఉపయోగ పడుతుందన్నారు.

కులగణనకు సన్నద్ధమవుతోన్నయంత్రాంగం :కులగణనకు సర్కారు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాల్లో ఇళ్ల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదిలాబాద్‌ రిక్షా కాలనీ, శ్రీరాంకాలనీల్లో సిబ్బంది చేపడుతున్న ఇళ్ల గుర్తింపు ప్రక్రియను కలెక్టర్‌ రాజర్షిషా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈనెల 6 నుంచి సర్వే ప్రారంభమవుతుందన్న దృష్ట్యా ప్రజలంతా విశ్వసనీయ సమాచారం ఇవ్వాలని సూచించారు.

సర్వే వివరాల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయనుందని కలెక్టర్‌ రాజర్షిషా వెల్లడించారు. ప్రణాళికబద్ధంగా ఇంటింటి సర్వేను నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే కోసం చేస్తున్న ముందస్తు సన్నాహాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్యుమారేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సరైన వివరాలు తీసుకోవాలని కలెక్టర్‌ క్రాంతి సూచించారు.

150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్​ :ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో అధికారుల సర్వేను కలెక్టర్ దివాకర్‌ పర్యవేక్షించారు. కుటుంబ సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, కుల సర్వేను పక్కాగా నిర్వహించాలని సూచించారు. 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ సర్వే చేయాలని స్పష్టంచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటలో గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో సమగ్ర సర్వేకు సన్నద్ధమయ్యారు. గడప గడపకు తిరుగుతూ ఇంటింటి సర్వే స్టిక్కర్లను తలుపులకు అంటించారు.

100 శాతం కచ్చితత్వంతో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్రంగా చేపట్టాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ అధికారులకు సూచించారు. బంజారాహిల్స్‌లోని గౌరీశంకర్ కమ్యూనిటీ హాలులో ఖైరతాబాద్ జోన్‌లో చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై, సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు దాన కిషోర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

పొరపాట్లకు తావులేకుండా :సర్వేలో వివిధ వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని దానకిషోర్​ సూచించారు. గ్రేటర్ పరిధిలో సర్వేను చేపట్టేందుకు 21 వేల మంది ఎన్యూమరేటర్లను వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఆర్పీలను కూడా సర్వేలో భాగం చేశామన్నారు. సర్వేను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక్కో సూపర్ వైజర్‌ను నియమించామని దాన కిషోర్ వెల్లడించారు.

సమగ్ర సర్వే ద్వారా ప్రభుత్వ పథకాలు చిట్టచివరి పేదవారికి చేరేందుకు దోహదపడతాయని దాన కిషోర్ పేర్కొన్నారు. సర్వే వివరాలు నిక్కచ్చిగా నమోదు చేసేందుకు వీలుగా క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టే ముందు ప్రతి ఎన్యూమరేటర్ జిరాక్స్ సర్వే పత్రాలతో ప్రాక్టీసు చేసేలా చూడాలని అప్పుడే వారికి పూర్తి అవగాహన వస్తుందని మున్సిపల్ అధికారులకు సూచించారు.

మెగా హెల్త్​ చెకప్​లా ఉపయోగపడుతుంది :ఈనెల 6 నుంచి జరగనున్న సమగ్ర కుల గణనలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. భవిష్యత్తులో అన్ని పథకాలకు ఈ సర్వే ఒక మెగా హెల్త్ చెకప్‌లా ఉపయోగ పడుతుందన్నారు. సమగ్ర కుల గణనకు సహకరించాలంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దేశంలో తొలిసారి జరుగుతున్న ఈ సర్వేను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 85వేల ఎన్యుమరేటర్లు, 8 వేల 500 మంది పరిశీలకులు ఇంటింటి సర్వే చేస్తారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈనెల 30 వరకు సమాచార సేకరణ, డేటా ఎంట్రీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

తెలంగాణలో కులగణనకు డేట్​ ఫిక్స్ - ఏమేం అడుగుతారంటే?

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రభుత్వం ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details