Telangana CM Revanth Reddy Public Meeting: మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, 80 వేల పుస్తకాల్లో ఏం చదివారో చెప్పాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రజలనే కాదని వేములవాడ రాజన్నను సైతం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇవాళ వేములవాడలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేటీఆర్ ఎంతదూరం ఉరుకుతారో చూస్తా:తన నియోజకవర్గంపై కేసీఆర్‌కు ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. తానేమీ లక్ష ఎకరాలు సేకరించలేదని, తాను సేకరిస్తానన్నది 4 గ్రామాల్లో 1100 ఎకరాలు మాత్రమే అని తెలిపారు. 1100 ఎకరాల భూసేకరణ ప్రపంచ సమస్య అయిందా అని నిలదీశారు. కేటీఆర్ దిల్లీకి వెళ్లి నాపై ఫిర్యాదులు చేస్తున్నారని, కేటీఆర్ ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరించారు. లగచర్లలో భూసేకరణపై కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెడతారని అన్నారు. కేటీఆర్ ఉరుకులాటను గమనిస్తూనే ఉన్నానన్న రేవంత్‌రెడ్డి, ఎంతదూరం ఉరుకుతారో తానూ చూస్తానని అన్నారు.
త్వరలోనే మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాయిదా పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మంత్రి ఉత్తమ్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈనెల 30న మరోసారి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని వెల్లడించారు.
జనవరి నుంచి ముఖ్యమంత్రి పాదయాత్ర - అక్కడి నుంచే ప్రారంభం
దేశానికి ప్రధానిని ఇచ్చిన గడ్డ ఇది: దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్ అని, పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహరావు అని రేవంత్ కొనియాడారు. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ ఇక్కడి నుంచే ప్రకటన చేశారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో జైపాల్ రెడ్డి కీలకపాత్ర పోషించారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎంత దూరమైనా వెళుతుందని స్పష్టం చేశారు. ఎంపీగా పొన్నం ప్రభాకర్‌ను గెలిపిస్తే తెలంగాణను తీసుకువచ్చారన్నారు. అదే బండి సంజయ్‌ను గెలిపిస్తే కేంద్రం నుంచి కరీంనగర్‌కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీలు కూడా కరీంనగర్‌కు ఏం చేయలేదని విమర్శించారు.