TDP on Ramoji Rao Birth Anniversary: రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపక ఛైర్మన్ రామోజీరావు జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ (TDP) ఘనంగా నివాళులు అర్పించింది. తెలుగు సినీ, పత్రికా రంగానికి రామోజీరావు చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రత్యేకంగా వీడియో రూపొందించి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. తెలుగు వెలుగు, నిత్య స్ఫూర్తి ప్రదాత, సమాజహిత వ్యాపారవేత్త అని కొనియాడుతూ రామోజీరావుకు టీడీపీ నివాళులు అర్పించింది.
1936 నవంబర్ 16వ తేదీన కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత రామోజీరావు జన్మించారు. కుటుంబసభ్యులు రామోజీకి ఆయన తాతయ్య రామయ్య పేరు పెట్టారు. స్కూల్లో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి, తన పేరును తానే పెట్టుకున్నారు. రామోజీరావు చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి. 1974 ఆగస్టు 10వ తేదీన విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలన సృష్టించారు.
ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర:అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ రామోజీరావు చెరగని ముద్ర వేశారు. 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను ప్రారంభించారు. దేశంలోనే అగ్రశ్రేణి చిట్‌ఫండ్స్ సంస్థగా మార్గదర్శి చిట్ ఫండ్స్ నిలిచింది. 60 ఏళ్లలో లక్షలాదిమంది క్లయింట్‌లకు నిబద్ధతతో సేవలు అందించారు. మార్గదర్శి సంస్థ ద్వారా వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు.