TDP Pattabhi Ram Comments on YS Jagan: 2003లో 9 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన జగన్ ఇంతలోనే ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. తండ్రి అధికారం, తన అధికారం అడ్డుపెట్టుకొని ప్రజా సంపదను దోచుకున్నదే కాని సక్రమ సంపాదన కాదని దుయ్యబట్టారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు జగన్ ముఠాలో తోడుదొంగలు కాదా అని నిలదీశారు. తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠాగా వీరంతా ఉన్నారని అన్నారు.
ఫ్యామిలీ డ్రామా నడుస్తోంది: తాడేపల్లి నుంచి ఆదేశాలు రాగానే చెప్పింది చెప్పినట్లు చేస్తారని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్‌మోహన్ రెడ్డి కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తోందని విమర్శించారు. జగన్‌కు, తనకు మధ్య 2019లో ఒప్పందం కుదిరిందని, ఆస్తుల పంపకాల విషయమై ఎంవోయూ జరిగిందని షర్మిల చెప్పారని పట్టాభి గుర్తు చేశారు. ఎంవోయూకు కట్టుబడి ఉండకుండా తనపై, తల్లిపై కేసు పెట్టినట్లు షర్మిల చెప్పారన్నారు. చంద్రబాబు సమక్షంలో జగన్, షర్మిల మధ్య ఎంవోయూ జరిగిందా అని పట్టాభి ఎద్దేవా చేశారు. జగన్, షర్మిల కుటుంబ అంశాలతో చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు.
15 ఏళ్లు అయినా పరిశ్రమ స్థాపించలేదు- సరస్వతీ భూములను స్వాధీనం చేసుకోవాలి
జగన్‌తో చంద్రబాబు కోర్టులో పిటిషన్ వేయించారా అని పట్టాభిరామ్ నిలదీశారు. జగన్ ఎవరికి చెప్పి కోర్టులో పిటిషన్ వేశారన్న పట్టాభి, సొంత తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చి రచ్చ చేశారన్నారు. ఇది చాలా చిన్న విషయమని, ఘర్ ఘర్‌కీ కహానీ అని జగన్ చెప్పారని, మీరు చేసే తప్పుడు పనులను అందరికీ ఆపాదించేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు తన సోదరీమణులకు తండ్రి ఆస్తిలో భాగమే కాదు తన కష్టార్జితాన్ని కూడా ఇచ్చారని చిత్తూరు జిల్లా ప్రజలందరికి తెలుసునని పట్టాభి స్పష్టం చేశారు. చంద్రబాబు సోదరీమణులు జగన్ రెడ్డి సోదరిలాగా తన అన్న అన్యాయం చేశాడని బోరున విలపించలేదని గుర్తుచేశారు. తిరుపతి దొడ్డాపురం వీధి సందులో అద్దె ఇంట్లో ఉండి, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉండే జిరాక్స్ షాప్లో జూనియర్ పార్ట్నర్గా ఉన్న కరుణాకర్ రెడ్డికి నేడు వేల కోట్లు ఎలా వచ్చాయన్నారు. దేవుడి సొమ్ము, టీడీఆర్ బాండ్ల దోపిడీతో కాదా అని దుయ్యబట్టారు.
వైవీ సుబ్బారెడ్డి కుటుంబం బమిడకలొద్ది ల్యాట్రైట్ పేరుతో బాక్సైట్ దోపిడీ చేసింది నిజం కాదా అని పట్టాభి ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి సూట్ కేసు కంపెనీలు పెట్టించి విశాఖలో భూములు కబ్జాచేయించి గిరిజన మహిళ కుటుంబంలో చిచ్చుపెట్టి అబద్ధాలాడే వ్యక్తి మాటలకు విశ్వసనీయత ఉందా అని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై నిందలు వేసి దోపిడీ సొమ్ము పంపకంలో కుట్రలను కప్పెట్టుకునే యత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అబద్దాలతో, నిందలతో ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరని అన్నారు.
ఐదేళ్లు మీరు గాడిదలు కాశారా ? చార్జిషీట్లో వైఎస్ పేరు చేర్పించింది జగన్ కాదా?-విజయసాయి రెడ్డికి షర్మిలా కౌంటర్