TDP Leaders Reacts On Court Judgment to Pinnelli EVM Issue : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 6వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి పునరాలోచించాలని టీడీపీ నేతలు కోరారు. ఈవీఎంను పగులగొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య ద్రోహి అయిన పిన్నెల్లికి కోర్టు రక్షణ కల్పించడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. పిన్నెల్లి అరెస్ట్ విషయంలో పోలీసులు దొంగా పోలీస్ ఆట ఆడారని విమర్శించారు. పిన్నెల్లి పట్టుకునేందుకు పోలీసులు కావాలనే మూడు రోజులు కాలయాపన చేశారని మండిపడ్డారు. ముందుగా వేసుకున్న పన్నాగం ప్రకారమే ఈవీఎంలను ధ్వంసం చేశాక పిన్నెల్లికి పోలీసులు సహకరించారని ఆరోపించారు.
పిన్నెల్లిని అరెస్టు చేసి ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి : పిన్నెల్లి వ్యవహారంపై ఓ ప్రకటనలో కనకమేడల రవీంద్రకుమార్ తీవ్రంగా మండిపడ్డారు. పిన్నెల్లి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతమైనా ప్రాంతాలను గుర్తించిన పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో మాచర్లలో హింస చోటు చేసుకున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఈసీ అరెస్టు చేయాలని ఆదేశించినా పోలీసులు కావలనే జాప్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు హింసాత్మక చర్యలకు సహకరించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని ఎద్దేవా చేశారు.
టీడీపీ ఏజెంట్ నంబూరిపై హత్యాయత్నం చేసినా ఎటువంటి కేసు లేదని విమర్శించారు. కౌంటింగ్ రోజు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా? అన్న అనుమానం కలుగుతుందన్నారు. పిన్నెల్లిని అరెస్టు చేసి ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలిని డిమాండ్ చేశారు. అలాగే కౌంటింగ్‌కు సీఈసీ రాష్ట్రంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. భద్రతా చర్యలను స్వయంగా ఎన్నికల కమిషనే పర్యవేక్షించాలని కనకమేడల రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు.
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోని పీవో, సిబ్బందిపై ఈసీ వేటు - PO and Staff Suspend
అధికారంలోకి రావడం ఖాయం: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అహంకారపూరిత అధికారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ధ విప్లవంతో అణిచివేశారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్ అని తెలిసినా అక్కడ సెంట్రల్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నిశ్శబ్ధ విప్లవంతో వైకాపా అవినీతి కోటలు కూలిపోయాయని కూటమి అధికారంలోకి రావడం ఖాయమని వర్ల ధీమా వ్యక్తం చేశారు.