TDP leaders Fire on YSRCP Government :ఐదేళ్లుగా అడ్డగోలుగా తెచ్చిన అప్పులు చాలవన్నట్లు జగన్ ప్రభుత్వం మరో దారుణానికి ఒడిగట్టింది. ఒకప్పుడు అమరావతిని స్మశానం, ఎడారి అని విమర్శించిన పెద్ద మనిషి ఇప్పుడు అదే ఎడారిలో నిర్మించిన సచివాలయాన్ని రూ.370 కోట్ల అప్పు కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్ద తాకట్టు పెట్టేశారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని దుయ్యబట్టారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టడం చాలా అవమానకరం, బాధాకరమన్నారు. సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని జగన్ నాశనం చేశాడని విమర్శించారు. అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో ప్రజలు ఏం కోల్పోతున్నారో ఆలోచించాలని ఎక్స్ (X) వేదికగా ప్రజలకు చంద్రబాబు విజ్ఙప్తి చేశారు.
అమరావతి భ్రమరావతి అనే జగన్- సచివాలయాన్ని ఎలా తాకట్టు పెట్టారు- రాజధాని రైతుల ఆగ్రహం
AP Secretariat Mortgage :గత ఐదేళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని 12.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినజగన్‌ఇప్పుడు ఏకంగా సచివాలయాన్ని తాకట్టుపెట్టారన్న వార్త చూసి షాక్‌కు గురైనట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తే ఒంటికాలిపై లేచిన వైకాపా మేధావులు దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా శ్రీలంక తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదని సచివాలయాన్ని370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్ పనితనాన్ని చూశాక ఆ దేశంతో పోల్చడం ఏ మాత్రం సరికాదని అన్నారు. ఇంతకంటే దిగజారలేరు అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు దిగిపోతూ రాష్ట్ర పరువును మంటగలుపుతున్న ముఖ్యమంత్రి జగన్ని ఏమనాలో ఎవరితో పోల్చాలో కూడా మాటలు రావడం లేదని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.