TDP Leader Nakka Anand Babu Comments on Illegal Sand Mining : రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా నిజమేననన్న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రిత్వ శాఖ-ఎంఓఈఎఫ్ నివేదికపై జగన్ జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు నిలదీశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక రద్దుతో పేదల పొట్ట కొట్టి 5 ఏళ్లలో 50 కోట్ల టన్నుల ఇసుక బొక్కేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లో 500కి పైగా రీచ్‌ల్లో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, కానీ కలెక్టర్లు మాత్రం రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరగటం లేదని ఎన్జీటికి నివేదిక ఇవ్వడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్ల చాటు మాటున ఇసుక తవ్వకాల్లో అక్రమాలు!
Illegal Sand Mining in Andhra Pradesh :ఇసుక రీచుల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రిత్వ శాఖ-ఎంఓఈఎఫ్ వారికి కనిపించిన అక్రమ మైనింగ్ జిల్లా కలెక్టర్లకు కనిపించడం లేదని నక్కా ఆనంద బాబు విమర్శించారు. జనవరి 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు జాయింట్ కమిటీ పర్యటించి కృష్ణ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌లలో అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్లు నిర్ధారించారని తెలిపారు. జేసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ భారీ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్టు కమిటీ నిర్ధారించిందని అన్నారు. దిల్లీ నుంచి వచ్చిన అధికారులకు ఇసుకలోని అక్రమాలు కనిపిస్తున్నాయన్న నక్కా ఆనంద్ బాబు, కలెక్టర్లకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగే ఇసుక తవ్వకాలు అన్నీ సక్రమమే అయితే ఎన్జీటీ ఇసుక తవ్వకాలు ఆపేయమని ఎందుకు ఆదేశించిందో, కోట్ల రూపాయల జరిమానాలు ఎందుకు విధిస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.