ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్కంఠ వీడేనా - ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఎవరు? - tdp janasena candidates

TDP Krishna District Politics: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరున్న ఉమ్మడి కృష్ణాజిల్లాలో రాజకీయం రంజుగా మారింది. జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానాల పరిధిలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాలకు గానూ 10 మంది అభ్యర్ధులను తొలి జాబితాలో ప్రకటించారు. మిగిలిన నాలుగు స్థానాల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశమయ్యింది. ప్రకటించాల్సిన 4 స్థానాల్లో అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లే అవకాశం ఉంది. కీలకమైన పెనమలూరు, మైలవరం స్థానాలకు టీడీపీ అభ్యర్ధులు ఎవరన్న ఉత్కంఠ వీడలేదు. మరోవైపు పార్థసారథితో పాటు పలువురు వైసీపీ నేతలు నేడు తెలుగుదేశంలో చేరనున్నారు.

tdp krishna district politics
tdp krishna district politics

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 10:34 AM IST

ఉత్కంఠ వీడేనా - ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఎవరు?

TDP Krishna District Politics: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 14 స్థానాల్లో 10 చోట్ల తొలి జాబితాలోనే తెలుగుదేశం తన అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన నాలుగు స్థానాల్లో రెండు జనసేనకు, రెండుస్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పోటీ చేస్తుందని భావిస్తున్న మైలవరం, పెనమలూరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ తెలుగుదేశంలో చేరడం ఖాయమైంది.

ఈ విషయాన్ని తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడు కలిసిన సందర్భంగా కృష్ణప్రసాద్‌ తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు స్పష్టంచేశారు. మైలవరం టికెట్‌ కూడా కృష్ణప్రసాద్‌కే ఇస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈస్థానం నుంచి ఇంఛార్జిగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ఈసారి ఆయనకు టిక్కెట్‌ ఉంటుందా లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. గత రాత్రి చంద్రబాబును కలిసిన దేవినేని ఉమ భేటీ అనంతరం తాను చంద్రబాబు కుటుంబసభ్యుడినని, అధినేత మాట శిరోధార్యమని వ్యాఖ్యానించారు.

టీడీపీ, జనసేన కూటమిలో జోష్‌- అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో నేతల సంబరాలు

పెనమలూరు నియోజకవర్గ అభ్యర్ధిత్వం కూడా పెండింగ్‌లో ఉంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్‌ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ఆయనే ఇంఛార్జిగా ఉన్నారు. 2014లో గెలిచిన ఆయన 2019లో ఓడిపోయారు. తెలుగుదేశంలోకి వచ్చిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి నూజివీడు తెలుగుదేశం టిక్కెట్‌ కేటాయించారు. ఆయన ఇవాళ తెలుగుదేశంలో చేరుతున్నారు. పెనమలూరు వైసీపీ అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్‌ పోటీ చేయనున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎవరు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరం.

బోడెప్రసాద్, వసంతకృష్ణప్రసాద్, దేవినేని ఉమల్లో ఒకరు ఉంటారన్న చర్చ జోరందుకుంది. అయితే అనూహ్యంగా తెరపైకి కొత్తగా మరో ఇద్దరి పేర్లు వచ్చాయి. సూపర్‌స్టార్‌ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పెనమలూరు నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండగా, ముస్లిం మైనార్టీ నుంచి ఎం.ఎస్‌. బేగ్‌ పేరు పరిశీలనలోకి వచ్చింది. పెనమలూరు నియోజకవర్గంలో 38వేల ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు ఉండడంపై తెలుగుదేశం అధిష్టానం అధ్యయనం చేస్తోంది. యువనాయకుడు ఎం.ఎస్‌. బేగ్‌ అభ్యర్ధిత్వంపై ఐవీఆర్​ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేయడమూ చర్చనీయాంశంగా మారింది.

అభ్యర్థుల పని తీరు బాగోకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనకాడను: చంద్రబాబు

విజయవాడ పశ్చిమ స్థానం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. ఆ పార్టీ తరపున పోతిన మహేష్‌ పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. తెలుగుదేశం నుంచి ఈస్థానాన్ని పలువురు ఆశించారు. 2019లో తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు 2014లో పొత్తులో భాగంగా బీజేపీ తరపున వెలంపల్లి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి గెలుపొందిన జలీల్‌ఖాన్‌ తెలుగుదేశంలో చేరారు. 2019లో ఆయన కూతురు షబానా పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం వైసీపీ నుంచి ఆసిఫ్‌ ఖరారయ్యారు.

తెలుగుదేశం నుంచి రాష్ట్రప్రధాన కార్యదర్శి బుద్దావెంకన్న పశ్చిమ సీటును ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ తనకు టిక్కెట్‌ కావాలని కోరారు. వైసీపీ నేతలను సైతం కలిశారు. మరో మైనార్టీ నేత ఎంఎస్‌ బేగ్‌ ప్రయత్నాలు చేశారు. అయితే దీన్ని జనసేనకు ఇచ్చేందుకు నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. అవనిగడ్డ స్థానం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన రంగంలోకి దించనుంది. ఈ స్థానాన్ని సీనియర్‌ నాయకుడు మండలి బుద్దప్రసాద్‌ ఆశించారు. తనకు టిక్కెట్‌ కేటాయించకపోవడాన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు.

సీటు రాని ఆశావహులకు చంద్రబాబు హామీ- తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ

ABOUT THE AUTHOR

...view details