CM Chandrababu on Swarnandhra Vision-2047: ఈ నెల 13న స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జీఎస్డీపీ వృద్ధి దిశగా అంతా కలిసి కట్టుగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది నుంచి వృద్ధి రేటు రెండు అంకెల్లో ఉండాలని కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు హెల్దీ, వెల్దీ, హ్యాపీ అనే విధానాలకు అనుగుణంగా కలెక్టర్లు కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
జీరో పావర్టీ లక్ష్యంగా ఆర్ధిక అసమానతలు తగ్గేలా ఎక్కడికక్కడ ప్రణాళికలు చేసుకోవాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తితో పాటు నదుల అనుసంధానంపై కూడా దృష్టి పెట్టాలని తేల్చి చెప్పారు. కలెక్టర్ల సమర్థతతోనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందన్నారు. పాలనలో చేసే మెరుగైన విధానాలను కలెక్టర్లు పలు చోట్ల అవలంబించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో 50 లక్షల మందికి చెందిన సమాచారం లేదని కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 5.4 కోట్ల మంది జనాభాకు గానూ కేవలం 4.9 కోట్ల మంది వివరాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. 50 లక్షల మంది పౌరుల సమాచారం ప్రభుత్వం వద్ద లేదని ప్రకటించారు. పురపాలక, రెవెన్యూ, రవాణా, విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన వివిధ శాఖల్లో వీరి సమాచారమే లేదని స్పష్టం చేశారు.
ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ : గతంలో చేపట్టిన సర్వేల్లో వీరెవరూ వివరాలు ఇవ్వకపోవటం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి వెల్లడించారు. కలెక్టర్లు ఈ విషయంపై దృష్టి పెట్టి జనవరి 31 తేదీలోగా వివరాలు సేకరించాలని సూచించారు. ఇంటింటి సర్వే ద్వారా పౌరులకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని సీఎం సూచించారు. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో రాష్ట్రంలోని పౌరుల బ్యాంకు వివరాలు కూడా అనుసంధానించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానించటంతో పాటు ఫొటోలు కూడా తీయాలని స్పష్టం చేసారు. గ్రామాలు, హ్యాబిటేషన్ల వారీగా కుటుంబాల మ్యాపింగ్ కూడా చేయాల్సిందిగా ప్రభుత్వం సూచించింది.