సీఎం క్యాంప్ ఆఫీసులోకి కంటెయినర్- ఎందుకొచ్చింది, ఏం తెచ్చింది? Suspected Container Vehicle at CM Camp Office: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఒక కంటెయినర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశమైంది. మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఏపీ 16 జడ్ 0363 (AP16 Z 0363) నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీస్ స్టిక్కరు ఉంది. సాధారణంగా జడ్ (Z) సిరీస్ ఆర్టీసీ బస్సులకు, పీ (P) సిరీస్ పోలీసు వాహనాలకు ఉంటుంది.
సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చే దారిలో ప్రధాన రహదారి వద్ద మెయిన్ గేట్ ఉంటుంది. అక్కడ వాహనం, అందులో ఉన్నవారి వివరాలను నమోదు చేసుకుని అనుమతిస్తారు. అదే సమయంలో ఆ వాహనం వివరాలను వైర్లెస్ ద్వారా ముందున్న చెక్‌పోస్టు సిబ్బందికి చెబుతారు. మెయిన్ గేటు నుంచి నుంచి డివైడర్‌కు ఎడమ వైపున ఈ వాహనాలు లోనికి వస్తాయి. మధ్యలో రెండో చెక్‌పోస్టు వద్ద ఆటోమేటిక్ స్కానర్ ఉంటుంది. ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం నంబరు, అందులో వచ్చిన వారి వివరాలను సరి చూసుకుంటారు.
వైసీపీ నేతల అధికార గర్వం - అర్చకులపై ఆగని దాడులు - YSRCP Leaders Attacks on Priests
ముందుగా అనుమతి ఉన్న సమాచారం ఉన్న వాహనాలనైతే ఆ స్కానర్ మీదుగా లోపలికి పంపుతారు. మంగళవారం వచ్చిన కంటెయినర్ ప్రధాన గేటు వద్ద ఎడమ వైపు రహదారిలో వచ్చినా, రెండో చెక్‌పోస్టుకు కాస్త ముందుగానే ఎడమ వైపు కాకుండా కుడి వైపు దారిలో మళ్లించి రాంగ్ రూట్లోనే క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. అందువల్ల రెండో చెకోపోస్టు వద్ద వాహనాన్ని స్కాన్ చేయలేదు. ఈ రెండో చెక్ పోస్టు ముందు నుంచి కాకుండా వెనక వైపు నుంచి ఈ వాహనం నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంది.
అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కి తిప్పి కంటెయినర్ భాగాన్ని లోపలి వైపు ఉంచారు. సుమారు గంట తర్వాత ఆ వాహనం వచ్చిన దారిలోనే వేగంగా బయటకు వెళ్లిపోయింది. ఈ కంటెయినర్ ఎందుకు వచ్చింది ? అన్ని వాహనాల్లా ఎడమ వైపు నుంచి కాకుండా వ్యతిరేక మార్గంలో వెళ్లడం, అలా వెళుతున్నా భద్రతా సిబ్బంది వాహనాన్ని ఆపకపోవడం ఇవన్నీ సందేహాలకు దారి తీస్తున్నాయి.
ఎన్నికల వేళ మళ్లీ జనం బాట పట్టిన జగన్ - ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర - JAGAN BUS YATRA