Supreme Court Orders to AP Govt on Illegal Mining: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికార యంత్రాంగం ఎన్నికల్లో నిమగ్నమైనందున మరికొంత సమయం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఎన్నికల కంటే పర్యావరణమే ముఖ్యమని స్పష్టం చేసింది. గడువు పొడిగిస్తూ వెళితే అధికారులు నిద్రపోతారని అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉంటాయని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ జైప్రకాశ్ పవర్ వెంచర్స్ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారించిన జస్టిస్ అభయ్ ఎస్.ఓక, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్జీటీ తీర్పులోని 7వ క్లాజ్ (రూ.18 కోట్ల జరిమానా)పై తప్ప ఇంకే అంశంపైనా తాము స్టే ఇవ్వలేదని స్పష్టతిచ్చింది. ఆ తీర్పులోని మిగతా అంశాల అమలుపై ఎన్జీటీ తగిన చర్యలు తీసుకోవచ్చని తేల్చిచెప్పింది. ఇసుక తవ్వకాలను నిలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సాధ్యమైనన్ని చర్యలు తీసుకోవడంతోపాటు, అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
సోమవారం ఈ కేసు విచారణ ప్రారంభమైన వెంటనే ప్రతివాది నాగేంద్రకుమార్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని నాశనం చేస్తోంది. ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన ఈ కేసులో సుప్రీంకోర్టు కేవలం క్లాజ్ 7పై మాత్రమే స్టే విధించింది. దాన్ని అడ్డుపెట్టుకుని అధికారులు అన్ని చర్యలనూ ఆపేశారు. ఎన్జీటీ కూడా తదుపరి చర్యలు తీసుకోలేకపోతోంది. కాబట్టి ఎన్జీటీ తీర్పులోని క్లాజ్ 7పై తప్ప మిగతా అంశాల అమలుపై స్టే లేదని స్పష్టత ఇవ్వాలి’ అని కోరారు. ఎన్జీటీ తీర్పులో స్టే ఇవ్వని మిగతా ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని, ఆ అంశంలో ఎన్జీటీ ముందుకెళ్లొచ్చని జస్టిస్ అభయ్ ఎస్.ఓక స్పష్టం చేశారు. ఎన్జీటీ ఇప్పటికే పర్యావరణ నష్టానికి పరిహారం ఖరారు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దు చేయబోమన్నారు. పర్యావరణ అనుమతుల్లేని చోట్ల ఇసుక తవ్వకాలు నిలిపేయాలని ట్రైబ్యునల్ చెప్పినా ఇప్పటికీ యంత్రాలతో తవ్వుతున్నారని, ఇప్పటికి రూ.10 వేల కోట్ల ఇసుకను అక్రమంగా తవ్వేశారని ఫొటో సాక్ష్యాలను ధర్మాసనం మందుంచారు. ‘కొత్తగా పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ఎవ్వరూ ఇసుక తవ్వకాలు జరపడానికి వీల్లేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. అక్రమంగా తవ్విన వారిపై క్రిమినల్ చట్టాల కింద కేసులు పెట్టాలి’ అని న్యాయమూర్తి ఆదేశించారు.
ఇసుక తవ్వకాలు అడ్డుకున్నందుకు ట్రాక్టర్‌తో తొక్కించారు- కత్తులు, రాడ్లతో హల్చల్ - YCP activists attacked villagers
రాష్ట్ర ప్రభుత్వమే అక్రమార్కులతో కుమ్మక్కైంది: లూథ్రా జోక్యం చేసుకుంటూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే అక్రమార్కులతో కుమ్మక్కై, అక్రమ తవ్వకాలకు ఊతమిస్తోందని చెప్పారు. ‘కరెక్ట్.. కరెక్ట్’ అంటూ జస్టిస్ ఓక ఏకీభవించారు. ఎన్జీటీ తీర్పు తర్వాత జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగడం లేదని ప్రభుత్వానికి అనుకూలంగా నివేదికలిచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో కుమ్మక్కవడంతో తీవ్ర విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయని లూథ్రా చెప్పారు. అనుమతుల్లేని ఇసుక తవ్వకాలను నిలిపేయాలని ఎన్జీటీ గత ఏడాది ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసినా జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ ఆ ఏడాది నవంబరు వరకు తవ్వకాలు జరిపిందన్నారు. తాము గత ఏడాది ఏప్రిల్ నుంచే తవ్వకాలు ఆపేశామని, ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేస్తామని జేపీ తరఫు న్యాయవాది చెప్పారు. దాన్ని లూథ్రా తోసిపుచ్చారు. వారు నవంబరు వరకు తవ్వకాలు జరిపినట్లు గనులు, భూగర్భశాఖ నివేదిక చెబుతోందన్నారు. ‘గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టడం లేదంటున్న జేపీ సంస్థతోపాటు ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులను (క్లాజ్ 7 మినహాయించి) పూర్తిగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మే 9లోపు అఫిడవిట్ వేయాలి. ఎన్జీటీ ఉత్తర్వుల్లోని క్లాజ్ 2కి విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరిగి ఉంటే ప్రతివాది (నాగేంద్రకుమార్) అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అందుకు బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు. తదుపరి విచారణను మే 10కి వాయిదా వేశారు.
ఇసుక అక్రమ తవ్వకాలు - కోడ్ ఉన్నా ఆగని దోపిడీ - YCP LEADERS ILLEGAL SAND MINING
అఫిడవిట్ దాఖలుకు సమయమివ్వండి:రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మది స్పందిస్తూ ‘క్లుప్తంగా అఫిడవిట్ దాఖలు చేయడానికి మేం సిద్ధం. ఆరోపణలపై చర్యలు తీసుకోవడానికీ కట్టుబడి ఉన్నాం. అధికారులు ఎన్నికల పనుల్లో తలమునకలై ఉన్నందున అఫిడవిట్ దాఖలు చేయడానికి మరో మూడు రోజులు సమయమివ్వండి’ అని పదేపదే విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి దానికి అంగీకరించలేదు. ‘మేం ఉత్తర్వులను అమలు చేస్తామని కనీసం అండర్ టేకింగ్ దాఖలు చేయండి. దానికి ఎన్నికలేమీ అడ్డంకి కావు’ అన్నారు. చివరగా సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ ఈ కేసులో ప్రధానంగా నివేదిక దాఖలు చేయాల్సింది కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అని రాష్ట్ర ప్రభుత్వ కుమ్మక్కు గురించి చెప్పాల్సింది అదేనని, అందువల్ల దాని నివేదికను తెప్పించుకోవాలని కోరారు. జస్టిస్ ఓక అంగీకరిస్తూ ట్రైబ్యునల్ తీర్పు అమలుపై మే 9లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు.
మూడేళ్లలో 3 వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ - వైఎస్సార్సీపీ ముఠా మాస్టర్ ప్లాన్ - Sand Mining in Andhra Pradesh