Snow Games at AMB Mall in Hyderabad : ఏప్రిల్ మధ్యలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 9 దాటిందంటే చాలు భానుడు భగభగమంటున్నాడు. ఇంత ఎండలో అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు. ఇళ్లల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏమాత్రం ఉపశమనం ఇవ్వడం లేదు. మండుటెండల్లో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించేలా స్నో కింగ్‌డమ్ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ కొండాపూర్‌లో ఉన్న ఏఎమ్‌బీ మాల్‌లో దాదాపు 14వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిశీలత వాతావరణం ఉండేలా దీన్ని నిర్మించారు.
ఏడాది పాటు స్నోకింగ్‌డమ్ తెరిచే ఉంటున్నా వేసవిలో మాత్రం ఎక్కువ గిరాకీ ఉంటోంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలో కిక్కిరిసిపోతోంది. సెలవు దినాల్లో మరింత సందడి ఉంటుంది. పాఠశాలల పిల్లలకు ప్రత్యేకంగా ప్యాకేజీ ఉంటుంది. కేవలం ఆహ్లాదం పంచడమే కాకుండా మంచు ప్రాంతాల్లో ఉండే వాతావరణం పెరిగిన కాలుష్యం వల్ల అక్కడ ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విధంగా సందేశాత్మక వీడియోలు సైతం ప్రదర్శిస్తున్నారు. వేడి వల్ల మంచు కరగడంతో పాటు అక్కడ జీవించే జంతువులు ఎలా చనిపోతున్నాయనే అంశాలపై పాఠశాలకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. అంటార్కిటికాలో ఉండే వాతావరణాన్ని కళ్లకు కట్టేలా ఇగ్లూ, స్నోమాన్, స్నోబేర్స్, షీల్స్, పెంగ్విన్స్ బొమ్మలను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లో స్నో కింగ్‌డమ్ - మంచులో ఆడుకోవాలనిపిస్తే అక్కడకు వెళ్లాల్సిందే?
అందరికి అందుబాటు ధరల్లో : దేశంలో జమ్మూకశ్మీర్, షిమ్లాలో తప్పితే ఎక్కడ కూడా మంచు ప్రాంతాలు కనిపించవు. యూరప్‌తో పాటు మరికొన్ని దేశాల్లోనూ మంచు కొండలు కనిపిస్తుంటాయి. ధనికులు మాత్రమే మంచు ప్రాంతాలను చూసేందుకు కశ్మీర్ లేదా ఇతర దేశాలకు వెళ్తుంటారు. కానీ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలు మాత్రం అంతదూరం వెళ్లడమంటే వ్యయప్రయాసే. సామాన్యులకు సైతం ఆ అనుభూతి కలిగించాలనే ఉద్దేశంతోనే స్నోకింగ్‌డమ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.