తెలంగాణ

telangana

ETV Bharat / state

నాటుకోడికి కేరాఫ్ అడ్రస్ : దేశీ కోడీ, కడక్‌నాథ్‌, పందెం కోడి - ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది - A SUCCESSFUL POULTRY ENTREPRENEUR

నాటుకోళ్ల వ్యాపారంలో రాణిస్తున్న హైదరాబాద్ యువకుడు - మూడేళ్లలోనే ముప్పై కోట్ల టర్నోవర్​ - లక్షల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదులుకుని మరీ వ్యాపారం

A Successful Poultry Entrepreneur In Hyderabad
A Successful Poultry Entrepreneur In Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2024, 3:35 PM IST

A Successful Poultry Entrepreneur In Hyderabad : నాటుకోడి పులుసు. ఆ పేరు చెప్పగానే చాలా మంది నోళ్లలో నీళ్లూరుతాయి. వైట్​ రైస్​తో తిన్నా, రాగి సంకటితో లాగించినా, బిర్యానీలో నంజుకున్నా ఆ రుచి వేరే లెవెల్‌. ప్రతి వారం కాకపోయినా పండుగనాడైనా నాటుకోడిని తిందామంటే బ్రాయిలర్‌ మాంసం దొరికినట్టుగా అది దొరకదు. అందుకే దేశంలోనే మొదటిసారి నాటుకోళ్లకీ ఓ బ్రాండ్‌ను సృష్టించారు ఇద్దరు హైదరాబాదీ యంగ్​స్టర్స్​. ‘కంట్రీ చికెన్‌ కో’ పేరుతో చికెన్‌ ఆహార ప్రియులకు విందు చేస్తూ, రైతులకూ చేయూతనిస్తున్న ఆ సంస్థ మూడేళ్లు దాటకుండానే రూ.30 కోట్ల టర్నోవర్‌ స్థాయికి చేరింది. అది ఎలా సాధ్యమైందంటే?

నాటుకోళ్ల వ్యాపారంలో రాణిస్తున్న సాయికేశ్​గౌడ్ (ETV Bharat)

నాటుకోళ్ల వ్యాపారంలో రాణిస్తున్న సాయికేశ్​గౌడ్, మహ్మద్​ షమీ :చికెన్‌ అనేది చాలా మందికి ఓ ఎమోషన్‌. ఆదివారం వస్తే చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగదు. అందుకు తగ్గట్టుగానే వీధికో చికెన్‌ షాపు దర్శనమిస్తుంది. మార్కెట్‌లోనూ అందుకోసం పలు బ్రాండ్లు ఉన్నాయి. అల్లుడొచ్చినప్పుడో, పండుగ సమయాల్లోనో ప్రత్యేకంగా తీసుకొచ్చే నాటుకోడి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అలాంటి నాణ్యమైన మాంసాన్నే బ్రాయిలర్‌ చికెన్‌లా ప్రతి వీధిలోనూ అందిస్తే ఎంత బాగుంటుందో కదా అనుకున్నారు హైదరాబాద్‌కి చెందిన ఇద్దరు యంగ్​స్టర్స్ సాయికేశ్‌ గౌడ్‌, అతని స్నేహితుడు మహ్మద్‌ షమీ. అనుకున్నట్టుగానే ప్రయత్నం చేసి విజయం సాధించారు. సరికొత్తగా నాటుకోడి చికెన్‌ స్టోర్‌ను డిజైన్‌ చేసి, దానిపై వారు పేటెంట్‌ను కూడా పొందారు.

ఇంతకీ వారికి ఆ ఆలోచన ఎలా వచ్చింది? : ఐఐటీ వారణాసిలో బీటెక్‌, ఎంటెక్‌ పూర్తి చేసిన సాయికేశ్​కు చిన్నప్పట్నుంచీ వ్యాపారం చేయాలనేది కల. అందుకే బీటెక్‌ చదువుతూనే స్నేహితుడు షమీతో కలిసి ఓ చైన్‌ నెట్‌ వర్కింగ్‌ సంస్థలో చేరి - ప్రాక్టికల్‌గా బిజినెస్ పాఠాలు నేర్చుకున్నాడు. దేశమంతా తిరుగుతూ మార్కెటింగ్‌ టెక్నిక్​లను ఒంటపట్టించుకున్నాడు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో రూ.28 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినప్పటికీ, ఆ అవకాశాన్ని వదులుకున్న సాయికేశ్‌ 2018లో హైదరాబాద్‌ నగరానికి వచ్చాడు.

డిమాండ్ తగ్గని వ్యాపారం చేయాలనుకుని :సిటీలోని పలు థియేటర్లకు పాప్‌కార్న్‌ అందించే ఓ సంస్థలో ఉద్యోగిగా చేరి, కొన్నాళ్లకు వ్యాపారంలో భాగస్వామిగా మారాడు. ఆ సంస్థ టర్నోవర్‌ను రూ.50 కోట్ల నుంచి రూ.200 కోట్లకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన సాయికేశ్‌ కొవిడ్‌ సమయంలో అందులోంచి బయటికొచ్చేశాడు. ఆ ప్రతికూల పరిస్థితులే ఆయనకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గని వ్యాపారం చేయాలనే ఆలోచనకు ఊపిరిపోశాయి. అందరికీ నచ్చి, గిరాకీ ఎక్కువగా ఉండే బిజినెస్‌ చేయాలనుకున్నాడు. కరోనా రోజుల్లోనూ చికెన్‌కు డిమాండ్‌ ఉండటం గమనించిన సాయికేశ్‌ - అతిథులకు నాటుకోడితో భోజనం పెట్టడాన్ని చాలా మంది ఓ గౌరవంగా భావించడం గమనించాడు.

నాటుకోళ్ల వ్యాపారంలో రాణిస్తున్న సాయికేశ్​గౌడ్ (ETV Bharat)

ఆ సమయానికి చికెన్​కు మటన్​కు తేడా తెలియదు :మన దేశంలో బ్రాయిలర్‌ చికెన్‌ అమ్మడానికి అనేక బ్రాండ్లు ఉన్నాయి గానీ, ఎంతో మంచిదీ అని చెప్పే నాటుకోడి మాంసానికి ఒక్క బ్రాండ్‌ కూడా లేకపోవడం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. అ పనేదో తానే ఎందుకు చేయకూడదని స్నేహితుడు షమీతో కలిసి రంగంలోకి దిగే సమయానికి సాయికేశ్‌కు చికెన్‌కు, మటన్‌కూ తేడా కూడా తెలియదు. అందుకే మొదట మార్కెట్‌లోని బ్రాయిలర్‌ చికెన్‌ గురించి షమీతో కలిసి విస్తృతంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. బ్రాయిలర్‌ కోళ్లు గుడ్డు నుంచి కోత దశకు చాలా తక్కువ సమయంలోనే వస్తున్నాయని తెలుసుకుని బాధపడ్డాడు.

నాటుకోడి మాంసాన్ని అందించాలనే లక్ష్యంతో :ఎంతోమంది ఎమోషన్‌గా భావించే చికెన్‌- ఆరోగ్యాన్ని పంచేదిలా ఉండాలని ఇంటి ఆవరణలో సహజంగా పెంచిన నాటుకోడి మాంసాన్ని అందించాలనే లక్ష్యంతో 2021 ‘కంట్రీ చికెన్‌ కో’ పేరుతో ఓ అంకుర సంస్థ (స్టార్టప్​నకు)కు శ్రీకారం చుట్టి హైదరాబాద్‌ నగరంలో ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ చికెన్‌ స్టోర్‌లను ప్రారంభించాడు. చికెన్‌ వినియోగదారుల ఫీడ్‌ బ్యాక్‌తో వ్యాపారంలో పలు మార్పులు చేసుకుంటూనే షమీతో కలిసి ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌’, నాబార్డ్‌ సహకారంతో శిక్షణ కూడా పొందాడు. నాటుకోళ్లను చీకటి షెడ్డుల్లో కాకుండా ఖాళీ స్థలాల్లో సహజసిద్ధంగా పెంచేలా చూడాలనుకున్నాడు.

నాటుకోళ్ల వ్యాపారంలో రాణిస్తున్న సాయికేశ్​గౌడ్ (ETV Bharat)

రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండేందుకు :ఇంట్లో ఖాళీ స్థలం, ఆసక్తి ఉన్న గ్రామీణ ప్రాంతాల వాసులకు - ముఖ్యంగా రైతులకు నెల వయసున్న పిల్లల్ని అందించి అవి పెరిగి పెద్దయ్యాక వాటని తిరిగి కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. అందుకోసం వేలాది మంది రైతులతో ఒప్పందం చేసుకున్న సాయికేశ్‌ ఆ రైతన్నలు పెంచిన కోళ్లకు యాంటీబయోటిక్‌ టెస్ట్‌, పెరిగిన వాతావరణం, ఎలాంటి మేత తీసుకున్నాయి, ఆరోగ్య పరిస్థితి తదితరాలన్నీ తెలుసుకోవడానికి పదిహేడు రకాల పరీక్షలు చేయిస్తాడు. అన్ని విధాలుగా బాగుంటే మాత్రమే వాటిని స్టోర్‌కి తీసుకొస్తుంటాడు.

అలానే గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల దగ్గరి నుంచే 5 నెలల లోపు మేకపోతుల్నీ కొనుగోలు చేసి లేత మటన్‌ను అందిస్తున్నాడు. దేశీ కోడీ, పందెంకోడి, కడక్‌నాథ్‌ తదితర మాంసాలతో పాటు గుడ్లు, నాన్‌వెజ్‌ పచ్చళ్లు, మారినేడ్స్‌ అందిస్తున్న ఈ స్టోర్‌కీ ఓ ప్రత్యేకత ఉందండోయ్. అక్కడున్న పలు రకాల నాటు కోళ్లలో మనం ఎంపిక చేసుకున్న దాన్నే క్లీన్‌ చేసి ఇస్తారు. ఎలాంటి దుర్వాసన లేకుండా ప్రత్యేకంగా డిజైన్‌ చేసుకున్న ఆ స్టోర్​కు పేటెంట్‌ కూడా రావడం విశేషం. కస్టమర్లకు ఆరోగ్యకరమైన మాంసం అందిస్తూ, మరింత మంది రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలనుకుంటున్నారు సాయికేశ్‌, షమీలు.

ఏంటీ! పాడి పశువుల అందాల పోటీలా!! - మీరెప్పుడైనా చూశారా?

తాళాలు పగలగొట్టి మాంసం దుకాణంలో చోరీ.. 55 కోళ్లు​ మాయం..

ABOUT THE AUTHOR

...view details