"మూడేళ్లకోసారి చేతికచ్చే పంట - గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నాం" Subabul Farmers Facing Problems: ఎన్టీఆర్ జిల్లాలో సుబాబుల్ రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు. దళారులు, పేపర్ కంపెనీలు కూడబలుక్కుని ధరను తగ్గించడంతో టన్నుకు వెయ్యి రూపాయల మేర నష్టపోతున్నారు. మూడేళ్లకోసారి చేతికొచ్చే పంటకు సరైన ధర ఇవ్వకపోయినా సర్కారు పట్టించుకోవడం లేదని కర్షకులు వాపోతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో గతంలో లక్ష ఎకరాల్లో సుబాబుల్ తోటలు ఉండేవి. రేటు గిట్టుబాటు కాకపోవడంతో వీటి సాగును రైతులు క్రమంగా తగ్గించేశారు. ఫలితంగా కర్రకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు పేపరు కంపెనీలు వ్యూహాత్మక దోపిడీకి తెరలేపాయి. గతంలో టన్ను 5వేల800 రూపాయల వరకు ధర పలకగా ప్రస్తుతం 4వేల 500 రూపాయల నుంచి 4వేల 600 రూపాయల మధ్య ధర ఉంది.
సుబాబుల్, జామాయిల్ రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం..
ప్రస్తుతం మార్కెట్లో కంపెనీలు ఇచ్చిందే రేటుగా పరిస్థితి తయారైంది. గతేడాది అక్టోబరు నుంచి జనవరి వరకు టన్ను 5 వేల 300 రూపాయల పైనే ధర ఇచ్చారు. ఇప్పుడు తగ్గించారు. ఎన్నికల సమయం కావడంతో పాలకులు, మార్కెటింగ్ శాఖ అధికారులు కంపెనీలను గట్టిగా నిలదీసే పరిస్థితులు లేవని అందుకే ఇష్టం వచ్చినట్లు ధర తగ్గించారని రైతులు వాపోతున్నారు.
ప్రస్తుత పొడి వాతావరణం సుబాబుల్ తోటలు నరికేందుకు అనుకూలం. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల కర్ర వస్తుందని అంచనా. టన్నుకు ధర తగ్గడం వల్ల ఎకరాకు 15వేల రూపాయల పైనే నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. పాదయాత్రలో సుబాబుల్ రైతులను ఆదుకుంటామని జగన్ ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో రామాయంపేటలో పేపర్ మిల్లు కోసం చేసిన ఎంవోయూనూ జగన్ వచ్చాక రద్దు చేయడంతో పరిస్థితి తారుమారైంది.
గిట్టుబాటు ధర కోసం సుబాబుల్ రైతుల ఆందోళన.. సీఎం హామీ ఏమైందని ప్రశ్న
గతంలో సుబాబుల్ పంటను వ్యవసాయ మార్కెట్ కమిటీలు కొని తిరిగి అమ్మేటప్పుడు రైతులకు గ్యారంటీ, భద్రత ఉండేది. కొన్నేళ్లుగా ఈ వ్యవస్థ నిలిచిపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. మళ్లీ వ్యవసాయ మార్కెట్ కమిటీల పర్యవేక్షణలోనే సుబాబుల్ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ విధానం అమల్లోకి వచ్చినా రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది.
సుబాబుల్, సరుగుడు, జామాయల్ పండించే ప్రాంతాల్లో ఎఫ్పీవో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. సుబాబుల్‌కు గిట్టుబాటు ధర లేక మార్కెటింగ్ ఇబ్బందులతో సతమతమవుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కంపెనీలతో మాట్లాడాలని కర్షక నేతలు కోరుతున్నారు.
సీఎం జగన్కు లోకేశ్ లేఖ.. నష్టాల్లో ఉన్న సుబాబుల్ రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి