Andhra Pradesh Election Counting Votes on June 4th :సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గరపడుతుండటంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర బలగాలను రంగంలోకి దించిన పోలీసు శాఖ వివిధ చోట్ల కవాత్ నిర్వహించింది. గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
హింసను ప్రేరేపిస్తే పీడీ యాక్ట్ : పల్నాడు జిల్లాలో పోలింగ్ అనంతరం హింస చెలరేగడంతో కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చిన పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లో కేంద్ర బలగాలతో కలిసి కవాత్ నిర్వహించారు. ఇవాళ్టి నుంచి 5 వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. హింసను ప్రేరేపిస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు.
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - సిబ్బందికి అధికారుల సూచనలు - Votes Counting Process
ఓట్లు వివరాలు అందరికీ కనిపించేలా డిస్‌ప్లే బోర్డులు :ఏలూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 938 మంది సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ హాల్‌లో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు వివరాలు అందరికీ కనిపించేలా డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
అదనపు బలగాలతో నిఘా ఏర్పాటు :ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాయలసీమ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు బలగాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు అనంతపురం ఎస్పీ గౌతమి సాలి తెలిపారు. జిల్లాలోని సున్నితమైన ప్రాంతాల్లో భద్రత చర్యలు తీసుకున్నామని అన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద మూడంచల భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పుట్టపర్తిలో నియోజకవర్గంలోని కొత్త చెరువులో డీఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యంలో పోలీసులు మాక్‌డ్రిల్ నిర్వహించారు.