ప్రతిభకు అడ్డురాని పేదరికం - పవర్ లిఫ్టింగ్‌లో శ్రీకాకుళం యువకుడు సత్తా Srikakulam Young Sportsman Ganta Rajasekhar : కృషి, పట్టుదల, దీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చని పేదరికం ప్రతిభకు అడ్డు రాదని నిరూపించాడు శ్రీకాకుళం యువకుడు. చదువుకున్న సమయంలోనే ఏదో సాధించాలనే తపనతో పవర్ లిఫ్టింగ్ క్రీడారంగాన్ని ఎంచుకొని సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి పతకాలు సాధించడమే లక్ష్యం అంటున్న క్రీడాకారుడు గురించి తెలుసుకుందాం.
శ్రీకాకుళం జిల్లా పొందూరు గ్రామానికి చెందిన 23 ఏళ్ల గంటా రాజశేఖర్ పవర్ లిఫ్టింగ్ లో తన ప్రతిభను చాటుతున్నాడు. రాజశేఖర్ ఇంటర్ చదువుతున్న సమయంలో అదే గ్రామంలో ఒక వ్యాయామశాల కోచ్ దగ్గర పవర్ లిఫ్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. డిగ్రీ చదువుతున్న సమయంలో కాలేజీ తరపున పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. దీంతో పవర్ లిఫ్టింగ్ పై రాజశేఖర్ కి మరింత ఆసక్తి పెరిగింది. కోచ్ డేగల రాము సూచనలతో మరింత సాధన చేశాడు. 2021 లో విశాఖపట్నం లో రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జూనియర్స్ విభాగంలో రజత పతకం సాధించగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన జాతీయ క్రీడల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించాడు. ఆ తర్వాత అంతర్జాతీయ పోటీలకు ఎంపిక అయినా పేదరికం కారణంగా వెళ్లలేకపోయాడు.
జీఎంఆర్ ఐటీ వేదికగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీలు - ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు
రాజశేఖర్ తండ్రి ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. వచ్చిన జీతంతో కుటుంబ పోషణనే కష్టంగా ఉన్న ఏదోలా కష్టపడి రాజశేఖర్‌ని డిగ్రీ వరకు చదివించాడు. తన కొడుకుకు పవర్ లిఫ్టింగ్ పై ఉన్న ఆసక్తికి అడ్డు చెప్పకుండా అప్పో సప్పో చేసి జాతీయ స్థాయి వరకు క్రీడల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించారు. అయితే అంతర్జాతీయ పోటీలకు పాల్గొనేందుకు సరిపడా డబ్బులు లేక రాజశేఖర్ ఒక ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం లో చేరాడు. కొన్ని నెలలు చేశాక పవర్ లిఫ్టింగ్ పై తనకున్న మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్ళీ సాధన ప్రారంభించాడు. అలా 2023 అక్టోబర్‌లో నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు పాల్గొనేందుకు అవకాశం వచ్చింది. దీనితో తల్లిదండ్రులు కొంత అప్పు చేయగా మిగిలినవి స్థానికులు సహాయం చేయడంతో 2023 అక్టోబర్ 5-9 వరకు జరిగిన అంతర్జాతీయ పవర్ లిప్టింగ్ పోటీల్లో పాల్గొని జూనియర్స్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించాడు. పవర్ లిఫ్టింగ్ క్రీడలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 20 పైగా పతకాలు సాధించిన రాజశేఖర్ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని దేశానికి పతకాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని చెబుతున్నాడు ఈ యువ క్రీడాకారుడు.
ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్డీ - కర్ణాటక గవర్నర్ నుంచి పట్టా అందుకున్న యువకుడు