Meena Sonik Inspirational Story :తల్లిదండ్రులు పిల్లలను అపూరూపంగా పెంచి పెద్ద చేస్తారు. బిడ్డలు ఎలా ఉన్నా వారిపై మమకారం చావదు. కానీ ఆమెది మాత్రం విచిత్రమైన పరిస్థితి. బతికి ఏం సాధిస్తావ్? ఇక చనిపో అని నేరుగా విషం చేతికిచ్చారు. ఇది చేసింది ఎవరో కాదు సొంతవాళ్లే. కారణం. మీనా సోనిక్ దివ్యాంగురాలని, కుటుంబపరువు పోతుందని. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయువతి తనకోసం తాను ఎలా పోరాడిందో ఏం సాధించిందో ఆమె మాటల్లో తెలుసుకుందామా!
'మమ్మల్ని గుర్తించాలని నాలాంటి వాళ్లు చాలామంది అనడం మీరూ వినే ఉంటారు. నా దృష్టిలో ఆ మాటకు అర్థం వేరు. మమ్మల్ని మనుషులుగా గుర్తించమని. నాకు మూడునెలలు ఉన్నప్పుడే మల్టిపుల్ కాంజెనిటల్ కాంట్రాక్చర్స్ అనే అరుదైన వ్యాధి సోకింది. మా సొంతూరు రాజమహేంద్రవరం అయినా, చికిత్స కారణంగా నా చిన్నతనమంతా తిరుపతి బర్డ్ ఆస్పత్రిలోనే గడిచింది. ఆడపిల్లననీ, పైగా వైకల్యం ఉన్నదాన్ననీ ఇంట్లో నన్ను ఇష్టపడేవారు కాదు.
నాలాంటి కుమార్తె ఉందంటే పరువు తక్కువగా భావించేవారు. అసలు నేను బతకడమూ వాళ్లకు ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచీ అమ్మే నన్ను కాపాడుకుంటూ వచ్చింది. 30 సర్జరీల తరవాత, ఇప్పుడు ఇలా ఈ చక్రాల కుర్చీలో కూర్చోగలుగుతున్నా. చిన్నప్పటినుంచీ అందరిపిల్లల్లా నాకేమో స్కూల్‌కి వెళ్లాలని, బాగా చదువుకుని, ఉద్యోగం చేయాలని కల. కానీ ఇంట్లో వాళ్లకు అది ఇష్టంలేదు. నువ్వు చదువుకుని ఏం చేస్తావ్ అనేవాళ్లు.
కానీ నాకు పట్టుదల ఎక్కువ. పోట్లాడి ఒప్పించా. తమ్ముడి పుస్తకాలు చదువుకుని నేరుగా పదోతరగతి పరీక్షలు రాశాను. దూరవిద్య ద్వారానే బీకామ్ కంప్యూటర్స్ కూడా పూర్తిచేశా. ఇక ఉద్యోగం చేద్దామనుకున్నప్పుడూ వ్యతిరేకతే. బయటికెందుకు? ఇంట్లోనే ఉండక అని. దీంతో ఇక నేను ఇంటి నుంచి బయటకు వచ్చేద్దాం అని నిర్ణయించుకున్నా. అప్పుడు నాకు తోడుగా అమ్మ కూడా హైదరాబాద్ వచ్చేసింది. కానీ మేం ఇంటికి తిరిగి వెళ్లాల్సివచ్చింది. ఈ క్రమంలోనే ఇంట్లోవాళ్లు మా పరువు తీయొ ద్దంటూ చనిపొమ్మని నా చేతికే విషం ఇచ్చి తాగమగమన్న సందర్భమూ ఉంది. అమ్మ అడ్డురావడంతో బతికిపోయా. ఆ తర్వాత మళ్లీ కొన్ని సంవత్సరాలకు నేను హైదరాబాద్ వచ్చాను.