Special Story on Anarchy of Bouncers : సాధారణంగా పబ్బులు, షాపింగ్ మాల్స్, ప్రముఖుల పర్యటనల సందర్భంగా టిప్‌టాప్‌గా కనిపిస్తూ అడ్డొచ్చిన వారందరినీ పక్కకు జరిపేయడం, ప్రశ్నిస్తే చితకబాదడం, గుంపులుగుంపులుగా ఉంటే ఒక్కొక్కరిని ఈడ్చి పారేయడం ఇదీ వ్యక్తిగత భద్రత పేరుతో బౌన్సర్లు చేస్తున్న అరాచకం. ఈ నేపథ్యంలోనే అసలు బౌన్సర్ల నియామకం, వారి విధులు ఏంటన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
బౌన్సర్లు పోలీసులు తరహాలో సఫారీ దుస్తులు ధరిస్తుంటారు. కొందరు సూడో పోలీసుల వలే ప్రవర్సిస్తూ దాడి చేస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ ఏజెన్సీలు బౌన్సర్ల పేరుతో నేర చరిత్ర ఉన్నవారిని నియమించుకుంటున్నారు. దేహదారుఢ్యం, ఎత్తు ఉంటే చాలన్నట్లు బౌన్సర్లుగా తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో బౌన్సర్లుగా చలామణి అవుతూ సెటిల్‌మెంట్లు చేస్తున్నవారి సంఖ్య ఎక్కువే. రూ.లక్షల్లో ఆదాయం, ఉచిత ఆహారం, వసతి కల్పించడంతో నేరచరిత్ర ఉన్నవారు ఇది సులభంగా ఎంచుకుంటున్నారు.
బౌన్సర్ల హడావిడి :
- ఇటీవల పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన సంగతి తెలిసిందే. హీరో అల్లు అర్జున్‌కు రక్షణగా వచ్చిన బౌన్సర్లు అభిమానులను తోసెస్తూ చేసిన హడావుడి తొక్కిసలాటకు ఓ కారణమైంది.
- తాజాగా మంచు కుటుంబం వివాదం నేపథ్యంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ వర్గాలు పదుల సంఖ్యలో బౌన్సర్లను తీసుకొచ్చారు. వారంతా పరస్పర ఘర్షణకు దిగడం, మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించడంతో వివాస్పదమైంది.
బౌన్సర్లపై కేసులు పెట్టొచ్చు :
- బౌన్సర్లు దాడి చేస్తే కేసులు నమేదు చేయొచ్చని పోలీసులు స్పష్టం చేశారు.
- బౌన్సర్ పేరుతో భద్రత వాడడానికి వీల్లేదు. వారిని ఎంపిక చేసినవారిని, వారి సేవలను పొందుతున్న వారి మీద చర్యలు తీసుకోవచ్చు.
- వీఐపీ భద్రతలో పాల్గొనే వారు వాకీటాకీలు ఉపయోగించొచ్చు.
- బౌన్సర్లు యూనిఫామ్ ధరించినప్పుడు దాని మీద కంపెనీ పేరుతో పాటు పీఎస్‌ఎల్‌ఎన్ లైసెన్సు నంబరు, దాని పక్కన రాష్ట్రం కోడ్ తప్పుక ఉండాలి.
- ఈ కోడ్‌ను పస్రా వెబ్‌సైట్లో వెతికితే సిబ్బంది వివరాలన్నీ వస్తాయి.