Gagan Mahal Palace Penukonda :శిల్పకళ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది విజయనగర రాజులు! ఆ కళకు వారు పెట్టింది పేరు. రాష్ట్రంలోని చాలా ప్రదేశాల్లో శిల్ప కళ ఉట్టిపడుతుంటుంది. నాడు నిర్మించిన కోటలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. అద్భుతం, అపురూపం అనదగ్గ కట్టడాలు నలువైపులా కనిపిస్తూ గత వైభవాన్ని మన కళ్ల ముందు కదిలేలా చేస్తాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయల కాలంలోని నిర్మాణాలు వారి వైభోగానికి నిదర్శనం. వారి పరిపాలన, శిల్పకళ గురించి నాటి నుంచి నేటి వరకు పుస్తకాల్లో కూడా వర్ణించారు.
విజయనగర సామ్రాజ్యానికి రెండో రాజధానిగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వెలుగొందింది. అక్కడ ఉన్న అలనాటి నిర్మాణాలు మనల్ని అబ్బురపరుస్తాయి. వెలుగులీని అలసిపోయిన దీప స్తంభాలు, ఆధ్యాత్మిక సుగంధాలు పంచిన ఆలయాలు, మూగబోయిన కళా మండపాలు, విశాల వాకిళ్లు, ఎత్తైన బురుజులు, నేటికీ చెక్కుచెదరని మెట్ల బావులు, పంట భూములను తడుపుతున్న చెరువులు గత శతాబ్దాల నాటి ఆనవాళ్లు. ఈ చారిత్రక సంపద మనల్ని శ్రీకృష్ణదేవరాయ రాజ్యంలోకి తీసుకెళ్తుంది. అక్కడ ఉన్నంత సేపూ రాయలు ఏలిన కాలంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.
బసవన్న బావి, రాగి గోపురం, దీపపు స్తంభం, తిమ్మరుసు బందీ ఖానా, పాలక్కరి చెరువు, ఊరువాకిలి బురుజులు, నాట్యాలయం నాటి శిల్పకళా సౌరభాలను పరిచయం చేస్తాయి. భోగసముద్రం ప్రహరీ, కొండమీది లక్ష్మీనరసింహాలయం, పసిరక్కరి కోనేరు, కొండమీది కోనేరు వంటివి ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. వీటిని పరిరక్షిస్తే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. హైదరాబాద్- బెంగళూరు నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఉండటంతో పర్యాటకుల రాకపోకలకు సులువుగా ఉంటుంది.