Rain Effect in AP :అనుకున్నసమయాని కన్నారాష్ట్రంలోకి ముందే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. సోమవారం రాయలసీమలో దాదాపుగా అన్ని జిల్లాలకు, కోస్తాంధ్రలో విజయవాడ వరకు విస్తరించినట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. వచ్చే 4 నుంచి 5 రోజుల్లో ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున వరకు అనకాపల్లి, బాపట్ల, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం మన్యం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా బనగానపల్లిలో 178 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో భారీ వర్షానికి బనగానపల్లి మండలం అప్పలాపురం గ్రామ సమీపంలోని వాగుకు భారీ ఎత్తున వరద రావడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రానికి చల్లని కబురు - అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ - Rain Alert In AP