SCR on General Coaches : దేశ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు సేవలందిస్తోన్న రైళ్లకు కొత్త బోగీల ఏర్పాటుపై రైల్వే శాఖ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్యను దశలవారీగా పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. రెండే జనరల్ కోచ్‌లు ఉన్న రైళ్లలో ఆ సంఖ్యను నాలుగుకు చేరుస్తున్నట్లు వెల్లడించింది. అవి కూడా ఆధునిక పరిజ్ఞానం కలిగిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉండనున్నట్లు వివరించింది. ఈ మేరకు జోన్ పరిధిలోని 21 జతల రైళ్లకు అదనగా 80 ఎల్‌హెచ్‌బీ బోగీలు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
కొత్త రూపం - అధిక సీట్లు : రైళ్లలో పేదలు జనరల్ బోగీల్లో ప్రయాణిస్తారు. ఇప్పుడు ఈ కోచ్‌ల రూపం మారుతోంది. ఇన్ని సంవత్సరాలు రైళ్లలో పాతకాలం నాటి సాధారణ బోగీలే ఉన్నాయి. ఇప్పటికి అనేక రైళ్లలో రెండే కోచ్‌లు ఉన్నాయి. దీంతో పేద ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే జనరల్ బోగీల సంఖ్యను పెంచాలనుకున్న రైల్వేబోర్డు ఆ మేరకు కార్యాచరణ ప్రారంభించింది. కొత్తగా వస్తున్న జనరల్ కోచ్‌లను ఎల్‌హెచ్‌బీ పరిజ్ఞానంతో తయారుచేసినవి ప్రవేశపెడుతున్నారు. పాతతరం ఐసీఎఫ్ బోగీల్లో 90 సీట్లు ఉండేవి. ఇప్పుడు ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల్లో సీట్ల సంఖ్య 100. ఇందులో ఎక్కువ మంది ప్రయాణించవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడు సైతం తక్కువ నష్టం ఉంటుంది.