Son-in-Law Robbery at Aunt House in Manyam District:పెళ్లి చూపుల కోసమని వచ్చాడు. మేనత్త ఇంట్లో విడిది చేశాడు. పెళ్లి చూపుల తర్వాత మేనత్త ఇంట్లో రాత్రి బస చేశాడు. అంతేకదా అనుకుంటున్నారా.. రాత్రి బస చేసిన సమయంలో మేనత్త ఇంట్లోని బంగారపై కన్నేశాడు. అంతే ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రూ. 50 వేల నగదుతో పాటు, బంగారం మొత్తం దోచుకున్నాడు. ఆ తరువాత బంధువులకు కూడా చెప్పకుండా ఇంటి నుంచి పలాయనం చిత్తగించాడు.
బయట నుంచి ఇంటికి తిరిగొచ్చిన వారు, మేనల్లుడు కనిపించకపోవటంతో ఖంగారు పడ్డారు. తీరా చూశాక, మేనల్లుడు వ్యవహరం బయటపడింది. ఈ దోపిడీపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటం, నిందితుడు పట్టుబడటంతో వ్యవహారం వెలుగు చూసింది. తాజాగా వెలుగు చూసిన ఈ దోపిడీ పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదబొండపల్లిలో ఈ ఏడాది జులై 27వ తేదీన చోటు చేసుకుంది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాణ మీడియా సమావేశంలో వెల్లడించారు. పార్వతీపురం మండలం పెద బొండపల్లికి చెందిన మనమ్మ ఇంట్లో ఈ ఏడాది జులై 27వ తేదీన 16.5 తులాల బంగారం చోరీకి గురైందని తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన తన మేనల్లుడు దేవబత్తుల లక్ష్మణరావు (34) ఈ దోపిడీకి పాల్పడినట్లు ఆమె స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు దేవబత్తుల లక్ష్మణరావుని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు. నిదింతుడి నుంచి 16.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు.