Son Abandoned Mother On Road At Sri Sathya Sai District : నవ మాసాలు మోసి కని పెంచి, సమాజంలో ప్రయోజకులుగా మారిన తమ పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు మురిపిపోతుంటారు. పిల్లల అనురాగం, మనవడు, మనవరాళ్లు మధ్య తమ ఆఖరి రోజులను గడపాలని కన్నవారు కలలు కంటారు. కానీ పిల్లల ఆప్యాయత కాదు కదా పట్టేడు అన్నం పెట్టడానికి వారికి భారం అవుతామని అసలు ఊహించి ఉండరు.
ఇప్పుడే వస్తానని చెప్పి : అడిగిన వెంటనే అన్నీ ఇచ్చే అమ్మ ఇప్పుడు భారమైంది. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ఓ కుమారుడు అనుకున్నాడు. అలా ఆ తల్లిని ఊరు కాని ఊరిలో వదిలేసి వెళ్లిపోయాడు. తన బిడ్డ వస్తాడని ఆ మాతృమూర్తి రోడ్డువైపే చూస్తూ అలాగే ఉండిపోయింది. ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. సోమందేపల్లిలో పెద్దమ్మ గుడి బస్టాండు వద్ద శనివారం సాయంత్రం (నవంబర్ 9న) ఓ కుమారుడు తన తల్లిని బస్సులో నుంచి కిందకు దించాడు. ఇప్పుడే వస్తానని చెప్పి, ఆమె దుస్తులున్న సంచీని ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అన్నం పెట్టలేక అమ్మను గెంటేశారు - స్థానికులు ఏం చేశారంటే!
చలించిపోయిన స్థానిక యువకులు :తన బిడ్డ భోజనం తెచ్చేందుకు వెళ్లాడని, వస్తాడని ఆ వృద్ధురాలు రోడ్డువైపే చూస్తూ అలాగే కూర్చుంది. రాత్రి అవుతున్నా తన కుమారుడు రాకపోవడంతో ఆమె ఆశలు వదులుకుంది. వృద్ధురాలి దుస్థితిని గమనించిన స్థానిక యువకులు ఆమెకు భోజనం, తాగునీరు అందించారు. ఆమె దీనస్థితిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో స్థానిక ఎస్సై రమేశ్‌బాబు, పోలీసు సిబ్బంది ఆదివారం ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్ర వినికిడి లోపంతో బాధపడుతున్న ఆమె, తమది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అని చెప్పింది. తన కుమారుల వివరాలు చెప్పలేకపోతోంది. దీంతో ఎస్సై రమేశ్‌బాబు చలించిపోయి ఆమెకు కొంత డబ్బు, ఆహారం అందించారు. ఇది తెలిసి అక్కడికి చేరుకొన్న ఆమడగూరు వృద్ధాశ్రమం నిర్వాహకురాలు అరుణజ్యోతితో ఎస్సై రమేశ్‌బాబు మాట్లాడి వృద్ధాశ్రమానికి తరలించారు.
తల్లికి అనారోగ్యంతో పాటు మానసిక సమస్య - ఆమె కుమార్తె ఏం చేసిందంటే?
నడిరోడ్డుపై మంటగలిసిన మానవత్వం - అందరూ చూస్తుండగానే రక్తపు మడుగులో యువకుడు మృతి