ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటికి వస్తారనుకునే లోపే విషాదం - తల్లిదండ్రులు షాక్​ - LOVERS SUICIDE IN VISHAKAPATNAM

విశాఖలో మీ అమ్మాయి చనిపోయిందంటూ ఫోన్​ - హైదరాబాద్​లో అమ్మాయి విశాఖ ఎందుకు వెళ్లిందని అనుమానం - ప్రేమజంట ఆత్మహత్య - ఇరు కుటుంబాల ఆవేదన

lovers_suicide_in_visakhapatnam
lovers_suicide_in_visakhapatnam (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2024, 3:38 PM IST

Lovers Suicide In Visakhapatnam : అబ్బాయి విశాఖలో కేటరింగ్​ నిర్వాహకుడు, అమ్మాయి హైదరాబాద్​లో ఇంజినీర్​. అమ్మాయి తరచూ విశాఖకు వచ్చి వెళ్తూ ఉండేది. వాళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఏమైందో తెలియదు మంగళవారం నాటికి ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.

తమ కుమార్తె హైదరాబాద్‌లో ఉందని అనుకుంటున్న తండ్రి పల్లంరాజుకి మంగళవారం ఉదయం ఫోన్‌ వచ్చింది. మీ కుమార్తె విశాఖలో చనిపోయిందని పోలీసులు చెప్పారు. ఆ మాట అతను నమ్మలేదు. మా అమ్మాయి విశాఖలో ఎందుకుంటుంది? హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని బదులిచ్చాడు. పోలీసులు ఆ యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం ఆమె సెల్‌ఫోన్‌ నుంచే చెప్పడంతో వాస్తవం తెలిసి ఒక్కసారిగా ఆ తల్లిదండ్రుల గుండె పగిలినంత పనైంది.

అమలాపురం విద్యుత్‌నగర్‌కు చెందిన పల్లంరాజు దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె సాయి సుస్మిత. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తుంది. తమకు చేదోడువాదోడుగా ఉంటున్న సుస్మిత మరణవార్త వారిని ఎంతో బాధించింది.

మరో వైపు :విశాఖలో ఉంటున్న తమ కుమారుడు దుర్గారావు సంక్రాంతికి ఇంటికి వస్తాడని అంతా సరదాగా గడపొచ్చని ఆనందంగా ఉన్న శ్రీనివాసరావు కుటుంబానికి కూడా మంగళవారం ఉదయమే పిడుగులాంటి సమాచారం తెలిసింది. దుర్గారావు విగతజీవిగా మారాడని తెలిసి అతని కుటుంబం కన్నీరుమున్నీరయ్యారు. సుస్మిత, దుర్గారావులది అమలాపురం పట్టణం కానీ వీరు ఆత్మహత్య చేసుకున్నది విశాఖలో.

అమలాపురం శ్రీరామపురం ప్రాంతానికి చెందిన పిల్లి శ్రీనివాసరావు (రంగా)కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తండ్రి వద్దే ఉంటున్నాడు. రెండో కుమారుడైన దుర్గారావు ఇంటర్‌ వరకు చదివాడు. ఇతను విశాఖలోనే ఏడాది నుంచి తన తండ్రి పేరుమీద కోనసీమ రుచులతో ‘రంగ క్యాటరింగ్, కుకింగ్‌’ నడుపుతున్నాడు. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చి సరదాగా గడుపుదామని అన్నాడని, ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగిందని శ్రీనివాసరావు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నప్పటి నుంచి తనతో ఉంటూ వంటకాల్లో ప్రావీణ్యం పొందాడని, తనకు అండగా ఉండే కుమారుడు తిరిగి లోకాలకు వెళ్లి పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏం జరిగిందంటే :విశాఖలో ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. యువతి, యువకుడు మూడంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున పారిశ్రామిక ప్రాంతంలో చోటు చేసుకుంది. గాజువాక సీఐ పార్థసారథి తెలిపిన వివరాల ప్రకారం.

"ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ లవ్" - దండలు మార్చుకుని దారుణంగా చంపేశాడు!

డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు (32) వెంకటేశ్వర కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో అద్దెకు ఉంటూ షీలానగర్‌లో కేటరింగ్‌ నిర్వహిస్తున్నారు. అమలాపురానికి చెందిన నూకల సాయి సుస్మిత (24) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆమె అప్పుడప్పుడూ దుర్గారావు నివాసానికి వచ్చి వెళ్తుంటుంది.

అయితే మంగళవారం తెల్లవారుజామున వీరు భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. వీరు ఆదివారం అరకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంట్లో పరిశీలించగా మద్యం తాగిన గాజు గ్లాసులు, టీవీ రిమోట్‌ పగిలిపోయి ఉండటంతో ఇద్దరికీ చిన్నపాటి గొడవ జరిగి ఉంటుందని, ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తరువాత మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రేమజంట ఆత్మహత్యతో వెంకటేశ్వర కాలనీలోని స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వీరి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం కావడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న సుస్మిత తరచూ విశాఖ వస్తున్నట్లు చెప్పారు. ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇద్దరూ ఏకాభిప్రాయంతో దూకేశారా, మరేదైనా జరిగిందా అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఏసీపీ టి.త్రినాథ్‌ సీఐ పార్థసారథి, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

పెద్దల తీర్పు అనుకూలంగా రాదేమోనని ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం - ప్రేయసి మృతి, ప్రియుడి పరిస్థితి విషమం - Lovers Suicide AttemptGirlFriendDie

ABOUT THE AUTHOR

...view details