Small Trader Murdered for Rs.2000 in Pulivendula:మానవత్వం మంటగలిసింది, డబ్బు దాడికి ఉసిగొల్పింది, పిడిగుద్దుల వర్షం కురిపించింది, ఇదంతా జరిగింది కేవలం 2 వేల రూపాయల కోసం. ఈ దాడితో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసింది. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆదివారం పట్టపగలు జరిగిన ఉదంతం ఇది. రూ.2 వేలు ఇస్తాం పోయిన ప్రాణాన్ని తెచ్చివ్వగలవా అని బాధితులు కన్నీటి పర్యంతం అవుతూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పులివెందుల పట్టణానికి చెందిన మోహన్ బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేస్తాడు. ఆదివారం అరటికాయల మండీ వ్యాపారి రామట్లపల్లె రామాంజనేయులు, ఓ హోంగార్డుతో పాటు అక్కడికి చేరుకుని మోహన్‌పై దాడి చేశాడు. వ్యాపారానికి అవసరమైన అరటి పండ్లు సరఫరా చేసిన రామాంజనేయులుకు మోహన్ రూ.2 వేలు బాకీ పడ్డాడు. ఆ డబ్బు ఇవ్వలేదని రామాంజనేయులు, హోంగార్డుతో కలిసి మోహన్‌పై దాడి చేసి పిడిగుద్దుల వర్షం కురిపించడమే కాకుండా తలపై కొట్టారు. దీంతో మోహన్ అక్కడికక్కడే పడిపోయారు.