"Skill Enumeration" Project Started in Mangalagiri :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న "నైపుణ్య గణన" ప్రాజెక్టును మంగళగిరి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, మంగళగిరి నగర పాలక సంస్థ అధికారులు నైపుణ్య గణన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరి అర్బన్ మండలం, తాడేపల్లి, దుగ్గిరాల, రాజధాని ప్రాంతంలోని 16 గ్రామాలను 5 క్లస్టర్లుగా విభజించారు. మొత్తం లక్షా 61వేల 421కుటుంబాల సమాచారాన్ని సేకరిస్తున్నారు.
రోజుకు 8 కుటుంబాల సమాచారాన్ని సేకరించనున్నారు. 30 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఐదు క్లస్టర్లలో 673 సిబ్బందిని నియమించారు. ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు 25 ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేక యాప్ లో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేశారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత ఈ సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు.
ఈ నైపుణ్య గణన కోసం ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఆరుగురు చొప్పున ఉద్యోగులు పని చేయనున్నారు. వీరు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి, ట్యాబ్‌ల్లో నిక్షిప్తం చేస్తారు. అక్షరాస్యులా? కాదా? ఉద్యోగులా? చదువు పూర్తయినా ఉద్యోగం రానివారా? ఉద్యోగం సంఘటిత రంగమా? అసంఘటిత రంగమా? నిరుద్యోగుల విద్యార్హతలు? ఇలా 25 రకాల ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తారు.