Jessy Raj Got PMRBP 2025 : అంతర్జాతీయ స్కేటింగ్ వేదికపై గుంటూరు జిల్లాలోని మంగళగిరి క్రీడాకారిణి మాత్రపు జెస్సీరాజ్‌ను రాణిస్తోంది. ఈ క్రమంలోనే ఆ అమ్మాయిని ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం వరించింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2025కి జెస్సీరాజ్ ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఏటా వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 25 మంది చిన్నారులకు కేంద్రం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. తాజాగా ఆ జాబితాను ఇటీవల కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
14 సంవత్సరాల జెస్సీరాజ్ విజయవాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తన 9వ ఏట నుంచి స్కేటింగ్‌లో శిక్షణ తీసుకుంటుంది. తల్లిదండ్రులు రాధ, సురేష్ ప్రోత్సాహం, కోచ్ సింహాద్రి సూచనలతో ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తోంది. అలా 50 పతకాలు, బహుమతులను సాధించింది. ఈ సంవత్సరం జూన్‌లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన పోటీల్లో ఇన్‌లైన్ ఫ్రీ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించి సత్తా చాటింది. దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ నెల 26న పురస్కారం అందుకోనున్నట్లు ఆమె తండ్రి సురేష్ వివరించారు.