Vijayawada Police Commissioner on Annual Crime Review Meeting -2024 : 2024 సంవత్సరంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో గతేడాదితో పోల్చితే నేరాల సంఖ్య స్వల్పంగా తగ్గిందన్నారు. అయితే గతంలో కంటే హత్యాయత్నం కేసులు పెరిగాయని, కేవలం ఆరు నెలల కాలంలోనే 92 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వార్షిక నేర సమీక్ష సమావేశం -2024 నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయవాడ సీపీ ఎస్.వి.రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, జిల్లాలో నేరాలను అరికట్టేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మరింతగా పటిష్టం చేశామని తెలిపారు. అస్త్రం యాప్‌ను ఉపయోగించి దసరా ఉత్సవాల్లో ట్రాఫిక్ ను సమర్ధవంతంగా నియంత్రించామని వెల్లడించారు. డ్రోన్ పోలీసింగ్, క్లౌడ్ పెట్రోల్ విధానాన్ని తెచ్చామని కమీషనర్ తెలిపారు. త్వరలో అస్త్రం యాప్ పై సెమినార్ నిర్వహిస్తామన్నారు. సైబర్ క్రైమ్ పై అవగాహన కోసం సైబర్ సిటిజన్ యాప్ ను రూపొందించామన్నారు. 3 లక్షల మందిని సైబర్ సిటిజన్ యాప్ లో భాగస్వాములను చేసినట్లు వివరించారు.
దేశంలో తొలిసారి స్మార్ట్ పోలీస్ ఏఐ వినియోగం - లక్ష సీసీ కెమెరాల అనుసంధానం : డీజీపీ
బ్యాంకర్స్ మీటింగ్ ద్వారా డిజిటల్ అరెస్ట్ నేరాలను పూర్తిగా నిలువరించామని సీపీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. అలాగే ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బుడమేరు వరదలు మాకొక సవాల్ అని, వరదల్లో పోలీసులు విశిష్టమైన సేవలు అందించారని గుర్తుచేశారు. గతేడాదితో పోల్చితే నేరాల సంఖ్య స్వల్పంగా తగ్గిందన్నారు. అయితే గతం కంటే హత్యాయత్నం కేసులు పెరిగాయని, కేవలం ఆరు నెలల కాలంలోనే 92 హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. సైబర్ నేరాలు 73.14 శాతం, 15.94 శాతం ఎస్సీ, ఎస్టీ కేసులు పెరిగాయన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగాయని సీపీ ఎస్.వి.రాజశేఖర్ బాబు చెప్పారు.
గత మూడు నెలల్లో గణనీయంగా ట్రాఫిక్ రద్ధీ పెరిగిందన్నారు. 1350 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి కేసుల్లో 267 మంది అరెస్ట్ చేశామని వివరించారు. 116 మంది పై ఎన్డీపీఎస్ సస్పెక్ట్,రౌడీషీట్లు నమోదు అయ్యాయని తెలిపారు. గతంలో కంటే రౌడీ, క్రైమ్ సస్పెక్ట్, కేడీ, డీసీ షీట్ హోల్డర్స్ సంఖ్య పెరిగిందన్నారు. కేవలం ఆరు నెలల్లో రౌడీ, క్రైమ్ సస్పెక్ట్, కేడి, లా&ఆర్డర్ సస్పెక్ట్, డీసీ షీట్ల సంఖ్య - 3,497 గా నమోదు అయ్యిందన్నారు. డిజిటల్ అరెస్ట్ కేసుల్లో గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేసిన ఒక కేసులో రూ.45 లక్షలు పోగొట్టుకుంటే, రూ.35 లక్షలు రికవరి చేశామని విజయవాడ పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు తెలిపారు.
బ్యాంకు ఖాతా కోసం వివరాలు ఇస్తున్నారా? - జాగ్రత్త పడకుంటే జైలుకే!
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.12కోట్లు లూటీ- ఆధార్ స్కామ్ అంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ట్రాప్