SIT Inquiry Adulteration Ghee Case: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన కల్తీ నెయ్యి వ్యహరం పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తిరుపతిలో రెండో రోజు విచారణ చేపట్టింది. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో సిట్ బృంద సభ్యులు తిరుపతిలోని పోలీస్ అతిథిగృహంలో ఉదయం సమావేశమయ్యారు. లడ్డూ అపవిత్రం చేయడం వెనక దాగిన కుట్రను వెలికితీసేందుకు అనుసరించాల్సిన విధానాలు, దర్యాప్తు తీరు తెన్నులను చర్చించిన సిట్ అధికారులు, మూడు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు.
సిట్‌లోని తొమ్మిది మంది సభ్యులు మూడు బృందాలుగా ఏర్పడి నెయ్యి కల్తీకి సంబంధించి విచారణ ప్రారంభించారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడినల్ ఎస్పీ వెంకటరావుల నేతృత్వంలో మూడు బృందాలుగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ బృందం పరిశీలించింది. నెయ్యి కల్తీ ఘటనపై తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణను పోలీస్ అతిథి గృహానికి పిలిపించి వివరాలు సేకరించారు.
కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దూకుడు - మూడు బృందాలుగా ఏర్పడి విచారణ - Tirumala Laddu Adulteration Case
కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండో రోజు విచారణ చేపట్టిన సిట్ బృందం టీటీడీ ఈవో శ్యామలరావును కలిసింది. పోలీస్ అతిథిగృహంలో సమావేశం అనంతరం శ్రీపద్మావతి అతిథి గృహం సమీపంలోని ఈవో కార్యాలయానికి వెళ్లిన సిట్ అధికారులు నెయ్యి కల్తీ వ్యవహారంపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ ఫిర్యాదు ఆధారంగా ఎ.ఆర్.డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును సిట్ స్వాధీనం చేసుకొంది. కేసు ఆధారంగా ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు పలు కోణాలలో దర్యాప్తు కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీపై లోతైన విచారణ నిర్వహిస్తామని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు సిట్‌కు బదిలీ అయిందని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు.
సిట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దుండిగల్‌లో ఏఆర్ డైయిరీ సంస్ధలో తనిఖీ, తిరుమల లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాల పరిశీలనతో పాటు లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను ప్రశ్నించనున్నారు. నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డైయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో పరిశీలించనున్నారు.
కల్తీ నెయ్యిపై సిట్ విచారణ - మూడు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో పర్యటన - SIT TEAM TO TIRUMALA