SIPB Meeting Approvals: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 85 వేల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వ ఆమోదం లభించింది. 34 వేల ఉద్యోగాలు కల్పించే 10 భారీ పరిశ్రమలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ (State Investment Promotion Board) తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, నారాయణ, వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ భేటిలో ఈ అనుమతులు, భూములు ఇచ్చేందుకు నిర్ణయించారు.
ఇవీ కంపెనీల వివరాలు: రాష్ట్రంలో గడిచిన 5 నెలల్లో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలు, ఒప్పందాలు, వాటి స్థితిగతులపై చర్చించారు. ఇందులో ఆర్సెలర్స్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ జేవీ నక్కపల్లి సమీపంలోని బంగారయ్యపేట వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ తొలిదశ నిర్మాణానికి 61 వేల 780 కోట్లు పెట్టుబడులు పెట్టి 21 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. 2029 నాటికి తొలిదశ పనులు పూర్తిచేయనుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ 5001 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి 1495 ఉద్యోగాలు ఇవ్వనుంది. కల్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ 1430 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 565 ఉద్యోగాలు కల్పించనుంది.
టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 76 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి 250 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ 3 వేల 798 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 200 ఉద్యోగాలు ఇవ్వనుంది. అజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ 1046 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి 2 వేల 381 ఉద్యోగాలు కల్పించనుంది. డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్పీ 50 కోట్ల పెట్టుబడి పెట్టి 2 వేల ఉద్యోగాలు ఇవ్వనుంది.