Aqua Sector Problems: మారుతున్న వాతావరణ పరిస్థితులు ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భరించలేని ఉక్కపోత, మధ్య మధ్యలో కురుస్తున్న వర్షాలతో కొల్లేరు, ఉప్పుటేరు, సముద్ర తీర ప్రాంతాలలోని మండలాల్లో రొయ్యలు, చేపల చెరువుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మేత ఎక్కువగా వేసిన చెరువుల అడుగు భాగాల్లో సేంద్రియ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. నీరు తగ్గిన చెరువుల్లో అమ్మెనియా, నైట్రేటు, హైడ్రోజన్ సల్ఫేటు వంటి హానికర వాయువులు వెలువడి ఆక్వా ఉత్పత్తులపై దుష్ప్రభావం చూపుతున్నాయి. చేపలు, రొయ్యల మొప్పల్లోకి విషవాయువులు చేరి ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2.59 లక్షల ఎకరాల్లో రొయ్యలు, చేపల చెరువులు సాగవుతున్నాయి. 1.50 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా, మరో 5లక్షల మంది రైతులు పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వార్షిక టర్నోవర్ 18వేల కోట్ల రూపాయలపైనే ఉంది. వాతావరణ మార్పులకు తోడు విబ్రియోసిస్, తెల్ల మచ్చల వైరస్‌లు రొయ్యలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
'మల్లె'కు కలిసిరాని మార్కెట్- వాడిపోతున్న అన్నదాతల ఆశలు - Jasmine Farmers Suffering
పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదు:రొయ్యల పిల్లలు వదిలిన 30 నుంచి 40 రోజుల్లో చెరువు దెబ్బతిన్న చోట ఎకరానికి లక్ష నుంచి లక్షా యాభై వేల వరకు నష్టపోవాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఉప్పునీటి శాతం తగ్గిన చెరువుల్లో మినరల్స్ లోపంతో రొయ్యలు గుల్లగా మారి రాత్రికి రాత్రే తేలిపోతున్నాయి. జిల్లాలో ఆకస్మిక పట్టుబడులతో సుమారు 15 వేల ఎకరాల్లో చెరువులు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఇదే అదనుగా దళారులు రేట్లు తగ్గించి రొయ్యలు కొనుగోలు చేస్తుండటంతో రైతులకు పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి కనిపించడంలేదు.
చేతికొచ్చిన పంట వాతావరణ మార్పుల కారణంగా దెబ్బతినకూడదనే ఉద్దేశంతో రైతులు అహర్నిశలు పాటుపడుతున్నారు. చెరువుల్లో ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు, ఏరియేటర్ల వినియోగానికి డీజిల్, రసాయన పొడులు, ప్రోబయోటిక్స్, మినరల్స్ చల్లుతూ రొయ్యలను బతికించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా కేవలం పది రోజుల వ్యవధిలోనే ఎకరానికి సగటున 15 వేల రూపాయలకు మించి అదనంగా ఖర్చు చేస్తున్నట్లు సాగుదారులు చెబుతున్నారు.
మారిన వాతావరణంతో సమస్యలు తలెత్తి నష్టాలు తప్పడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేత వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆక్సిజన్ శాతాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అదనంగా ఏరియేటర్లు ఏర్పాటు చేసుకుని ప్రాణవాయువు పడిపోకుండా చూడాలని మత్స్యశాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గుదిబండగా మారిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని రైతులు కోరుతున్నారు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్లను రద్దు చేసి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
బత్తాయి వ్యాపారుల బడా మోసం- ధర ఉన్నా నాణ్యత సాకుతో కోతలు - Mosambi Farmers Low Price