Electric Shock Incident in Undarajavaram : తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో కరెంట్ షాక్తో నలుగురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమం ఉంది. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ఈ ఘటన జరిగింది. మృతులు వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తీవ్ర గాయాలైన కోమటి అనంతరావును చికిత్స నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. 20 అడుగులకు పైగా ఉన్న విగ్రహానికి ఫ్లెక్సీలు కడుతుండగా ఈ ఘటన జరిగిందని ఉండ్రాజవరం పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. తాడిపర్రులో 144 సెక్షన్ విధించినట్లు వివరించారు. పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు సంబంధించి ఏడాదిన్నరగా రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈక్రమంలో ఇరు వర్గాలతో చర్చించిన తర్వాత కొవ్వూరు సబ్ కలెక్టర్ రాణి సుస్మిత విగ్రహావిష్కరణకు అనుమతి ఇచ్చారు. ఈరోజు ఉదయం సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరించాల్సి ఉంది. ఈలోగా దుర్ఘటన చోటు చేసుకుంది.
Chandrababu on Undarajavaram Incident : విద్యుదాఘాతం ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. నలుగురు మృతిచెందడం బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వారికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.
Current Shock in East Godavari District :ఈ ఘటనపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుదాఘాత మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. వారిని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వారు అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపించి, కుటుంబాలకు అండగా నిలుస్తామని మంత్రులు వివరించారు. మరోవైపు మృతుల కుటుంబాలను మంత్రి దుర్గేష్ పరామర్శించారు. తణుకు ప్రభుత్వాస్పత్రిలో వారిని పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. విద్యుదాఘాతం ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబుకు దుర్గేష్ తెలిపారు.
వేటగాళ్ల ఉచ్చుకు బలైన సీఆర్ఫీఎఫ్ ఏఎస్సై - సిబ్బంది అప్రమత్తమైనా దక్కని ప్రాణాలు - CRPF ASI died due to Electric Shock