Pensioners Died in Andhra Pradesh :ముఖ్యమంత్రి గారూ పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అభాగ్యులు మండుటెండల్లో మలమలమాడిపోయేలా చేసి రాక్షసానందం పొందుతారా? ఇది కుట్ర కాదా? ఇవీ పింఛనుదారుల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. బ్యాంకుల్లో నగదు జమకాక కొందరు, ఏ ఖాతాలో జమయిందో తెలియక కొందరు సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. మూడో రోజైన శుక్రవారమూ బ్యాంకుల వద్ద పింఛనుదారుల కష్టాలు అన్నీఇన్నీ కావు.
Seven People Died Due to Pension Problems : పింఛను నగదును వేరే వారి ఖాతాల్లో జమ చేయడమంటే ఎంత ఘోరం? అచ్చంగా జగన్ ఇదే చేశారు. పింఛనుదారుల ఆధార్ నంబర్ మిస్‌మ్యాచ్ అయిన బ్యాంకు ఖాతాలు వేలల్లోనే ఉన్నాయి. ఇలాంటివారికి ఇంటికే పింఛను ఇవ్వకుండా నేరుగా ఖాతాల్లోకి నగదు జమ చేశారు. దీంతో ఆ మొత్తం పింఛనుదారుల ఖాతాల్లో కాకుండా వేరే వారి ఖాతాల్లోకి వెళ్లింది. ఆ వివరాలు ప్రభుత్వం బయటపెట్టలేదు. వారందరూ పింఛను నగదు ఖాతాలో జమ కాలేదని ఆందోళన చెందుతున్నారు. జగనన్న కాలనీల్లో గుత్తేదారుల ద్వారా ప్రభుత్వమే ఇళ్లను నిర్మిస్తుందని చెప్పి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను ఆ గుత్తేదారుల ఖాతాలకు అనుసంధానం చేయించింది. గృహనిర్మాణ లబ్ధిదారుల్లో వేల మంది పింఛను తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారి ఖాతాల్లోని పింఛను నగదును జమ చేయగానే అది గుత్తేదారుల ఖాతాల్లోకి వెళ్లిపోయింది. ఆ గుత్తేదారులెవరో? ఎక్కడుంటారో? తెలియక పింఛన్‌దారులు మనోవేదనకు గురవుతున్నారు.
బ్యాంకుల చుట్టూ తిరిగి - ప్రాణాలు విడిచిన అవ్వాతాతలు - Pensioners died in Andhra Pradesh
పింఛనుదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాని వాటి లెక్కను ప్రభుత్వం ముందే సేకరించలేదు. మిస్ మ్యాచ్ అయినవాటి లెక్క తేల్చలేదు. 2, 3 బ్యాంకు ఖాతాలుంటే ఏ ఖాతాలో నగదు జమ చేసేది ముందు చెప్పలేదు. ఇవన్నీ పింఛనుదారులకు ఇబ్బందులు లేకుండా చేసేవే. వీటన్నింటినీ పట్టించుకోని జగన్ చనిపోయినవారి డేటాను మాత్రం పక్కాగా సేకరించారు. అవ్వాతాతల మృతికి విపక్షాలే కారణమంటూ నెపాన్ని వారిపై మోపి చనిపోయిన వారి ఖాతాల్లో నగదు జమ చేయకుండా జాగ్రత్తపడ్డారు. దివ్యాంగులు, నడవలేనివారు, తీవ్ర అస్వస్థతకు గురైనవారు, మంచాన ఉన్నవారికి ఇళ్ల వద్దనే పింఛను పంపిణీ చేస్తామని ఆదేశాలిచ్చిన జగన్ దాన్ని అమలు చేయలేదు.