No Facilities in Pedakurapadu Government Hospital:ఆస్పత్రి అంటేనే వైద్య పరికరాలు, ల్యాబ్‌లు, పడకలు. కానీ అక్కడ అవేమీ ఉండవు. అంతేకాదు కనీసం తాగునీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతులు కూడా లేవు. ఇవన్నీ లేకుండానే వైద్యశాలను ప్రారంభించారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ ఘనత కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే చెల్లింది. గత పాలకులు ప్రజారోగ్యాన్ని ఎలా విస్మరించారో దీన్ని బట్టి అర్ధమవుతుంది.
9 కోట్ల వ్యయం-అందుబాటులోకి రాని సేవలు: పల్నాడు జిల్లా పెదకూరపాడు సామాజిక వైద్యశాలకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే జీ ప్లస్ వన్ భవనాన్ని నిర్మించాలని గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. 9 కోట్ల వ్యయంతో ప్రణాళికలు రూపొందించింది. కానీ తర్వాత ప్రభుత్వం మారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో భవనంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
సుమారు నాలుగేళ్ల పాటు నత్తనడకన పనులు సాగించిన పాలకులు ఎన్నికలు సమీపించడంతో పైపైకి హడావుడి చేశారు. ఫలితంగా ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండానే గత ఎమ్మెల్యే శంకర్రావు కొత్త భవనాన్ని ప్రారంభించేశారు. హాస్పటల్లో వసతుల్లేక నిరుపయోగంగా మారి రోగులకు వైద్యసేవలు అందుబాటులోకి రాలేదు. సుమారు 9 నెలలుగా భవనం ఖాళీగా ఉండటంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. ఆకతాయిలు కిటికీలు పగల గొట్టేశారు.