ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెజవాడ బస్టాండ్​లో భద్రతా వైఫల్యం - బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి మూకలు హల్​చల్ - Pandit Nehru Bus Station - PANDIT NEHRU BUS STATION

Pandit Nehru Bus Station Security Problems in Vijayawada : విజయవాడ పండిట్​ నెహ్రూ బస్టాండ్​లో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్లాట్​​ఫాంలపై నిద్ర నటిస్తూ ప్రయాణికుల నుంచి గొలుసులు, లగేజీలు, పర్సులు కొట్టేస్తున్నారు. అవుట్​ సోర్సింగ్​ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే వారిపై కూడా దాడి చేస్తున్నారు.

bus_station
bus_station

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 7:49 AM IST

బెజవాడ బస్టాండ్​లో భద్రతా వైఫల్యం - బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి మూకలు హల్​చల్

Security Problem in Vijayawada Pandit Nehru Bus Station :బస్సుల్లోనే కాదు, బస్టాండ్‌లలోనూ ప్రయాణికులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్లలో ఒకటిగా చెప్పుకునే విజయవాడ బస్టాండ్‌లో భద్రత డొల్లగా మారింది. బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి మూకలు ఏకంగా భద్రతా సిబ్బందిపైనే దాడి చేసే స్థాయికి పరిస్థితి దిగజారింది. ఇక ప్రయాణికుల పరిస్థితి దైవాధీనమే.

విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్​ స్టేషన్‌లో ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన ఆర్టీసీ ప్రయాణికుల భద్రతనే ప్రశ్నార్థకం చేస్తోంది. గంజాయి సేవించి బస్‌స్టేషన్‌లో తిష్టవేసిన కొందరిని చూసి ప్రయాణికులు భయపడ్డారు. సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ సిబ్బంది వచ్చి వారిని బయటకు వెళ్లిపొమ్మంటే ఓ పోలీసు, ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిపైనే దాడి చేశారు. అడ్డుకోవాల్సిన పోలీస్‌ అవుట్‌పోస్ట్ పేరుకే తప్ప పనికొచ్చేలా లేదు. నిజం చెప్పాలంటే దీనికే భద్రతలేదు.

సీలింగ్ ఎప్పుడు ఊడి తలపై పడుతుందో తెలియదు. ఎలుకలు ఫ్లోరింగ్‌ను తవ్వేసుకుని రంధ్రాలు చేశాయి. ఇక్కడ విధులంటేనే సిబ్బంది ఇష్టపడడం లేదు. పోస్టింగ్ వేసినా, 4 రోజులు తిరక్కముందే బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు 24 గంటలు పనిచేసిన పోలీస్‌ ఔట్‌పోస్టును ఇప్పుడు ఒకరిద్దరు సిబ్బందితో నామమాత్రంగా నడిపిస్తున్నారు. ఏదైనా బందోబస్తు విధులుంటే ఇక్కడి సిబ్బందిని పంపి పోలీసు అవుట్ పోస్టును ఆ రోజుకు మూతేస్తున్నారు. బస్టాండ్‌ పరిసరాల్లో పోలీసులు పెద్దగా కనిపించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

"పండిట్​ నెహ్రూ బస్టాండ్​ చుట్టూ ప్రక్కల ఒక పోలీస్​ అధికారి కూడా లేడు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు. బస్​ స్టేషన్​కు రావాలంటే భయం వేస్తుంది" -ప్రయాణికుడు

ఫొటోగ్రాఫర్‌పై కటర్​తో దాడి - బ్లేడ్ బ్యాచ్ పని కాదన్న పోలీసులు

2014కు ముందు బెజవాడ బస్టాండ్ పరిసరాలు గంజాయి బ్యాచ్‌లకు విడిది కేంద్రంగా ఉండేవి. చీకటి పడితే అటువైపు వెళ్లాలంటే జనం జంకేవారు. అమరావతిని రాజధానిగా ప్రకటించాక తెలుగుదేశం ప్రభుత్వం బస్టాండ్‌లో భద్రతను పటిష్టం చేసింది. బస్టాండ్ లోపల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీస్‌ అవుట్ పోస్టు ఏర్పాటు చేశారు. షిఫ్టుల ప్రకారం పనిచేసేలా పది మంది సిబ్బందినీ నియమించారు. ఆర్టీసీ కూడా అదనంగా షిప్టుకు పదిమంది చొప్పున మరో 30 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. అయితే ఆర్టీసీ యాజమాన్యం కరోనా సాకుతో బస్టాండ్‌లో ప్రైవేటు సిబ్బందిని తొలగిస్తే, పోలీస్‌ శాఖ అవుట్ పోస్టులోని సిబ్బందిని తగ్గించింది.

సీసీ కెమెరాల్లో కొన్ని పని చేయకపోయినా పట్టించుకోవడం మానేశారు. మరికొన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలున్నా నిధులు ఇవ్వకపోవడంతో అవన్నీ బుట్టదాఖలయ్యాయి. కృష్ణలంక, గవర్నర్‌పేట పోలీసు స్టేషన్ల పరిధిలోనే వంద మందిపైగా రౌడీషీటర్లు ఉన్నారు. భద్రతా సిబ్బంది లేకపోవడంతో వీరంతా రాత్రి వేళల్లో బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బస్టాండ్‌లోకి సంఘ విద్రోహ శక్తులు రాకుండా ప్రహరీ సరిగా లేదు. రైల్వే ట్రాక్ వైపు నుంచి బ్లేడ్‌ బ్యాచ్‌లు బస్టాండ్‌లోకి ప్రవేశించేందుకు అనువుగా ఉంటోంది.

అసలే బ్లేడ్ బ్యాచ్, ఆపై గంజాయి మత్తు- తెల్లవారుజామునే దాడులు

27 ఎకరాల విస్తీర్ణంలోని బస్టాండ్‌లో కోట్ల విలువైన బస్సులు నిలిపి ఉంచుతారు. బస్టాండ్‌లో నాలుగైదు ఏటీఎంలూ ఉన్నాయి. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం సహా పలు ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాల్లో కీలక దస్త్రాలు, కంప్యూటర్లు ఉంటాయి. ఇక వచ్చిపోయే ప్రయాణికులైతే లక్షల్లో ఉంటారు. కానీ భద్రతా వ్యవస్థ పటిష్టంగా లేకపోవడంతో గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లు చెలరేగుతున్నాయి. అక్కడే నిద్రిస్తున్నట్లు నటిస్తూ మహిళా ప్రయాణికుల మెడల్లోని గొలుసులు కాజేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రయాణికులవే కాదు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల లగేజీలు, పర్సులు కొట్టేస్తున్నారు. గత ఆరు నెలల్లో బస్టాండ్‌లో 16 దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులే చెబుతున్నారు.

బెజవాడ బస్టాండ్​లో బ్లేడ్​బ్యాచ్, యాచకుల వీరంగం - ఏకంగా పోలీసులపైనే దాడి - Blade Batch Hulchul In Vijayawada

ABOUT THE AUTHOR

...view details