Security Failure in CM Jagan Stone Attack Incident:విజయవాడలో శనివారం సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుండగా వివేకానంద స్కూల్ వైపు నుంచే రాయి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీడియోల్లోనూ అలానే కనిపిస్తోంది. సాధారణంగా సీఎం ప్రయాణించే మార్గంలో ఎత్తయిన భవనాలను ముందే గుర్తించి, అక్కడ పోలీసులను మోహరిస్తారు. వీఐపీ వచ్చే ముందుగా ఆ రూట్‌లో ఒకటికి, రెండు సార్లు భద్రతా తనిఖీలు చేస్తారు. రెండంతస్తుల భవనంలో ఉన్న వివేకానంద స్కూల్ గదుల తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ భవనమంతా ఖాళీగానే ఉంది.
అయినా అక్కడ ఎందుకు భద్రతా సిబ్బందిని పెట్టలేదు? భద్రతా తనిఖీల్లో దాన్ని ఎందుకు విస్మరించారు? జగన్ పర్యటిస్తున్న మార్గంలో ముందస్తుగా డ్రోన్ ఎగరవేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించి, భద్రతాపరంగా ఎక్కడైనా సమస్యలున్నాయా అనేది క్షుణ్ణంగా గమనిస్తుంటారు. మరి అలాంటిది వివేకానంద స్కూల్ భవనం లోపల నుంచి గానీ, భవనం పైనుంచి గానీ ఎవరైనా, ఏదైనా విసిరితే ముప్పు ఉండే అవకాశముందని ముందే ఎందుకు గుర్తించలేదు? వీఐపీ భద్రత పట్ల ఇది నిర్లక్ష్యం కాదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర కోసం శనివారం చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై గుంటూరు-విజయవాడ మధ్య, ఇటు విజయవాడ నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిపేసి ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపించారు. జగన్ సర్వీసు రోడ్డులో మధ్యాహ్న భోజనం కోసం ఆగితే జాతీయ రహదారి మీదా వాహనాల్ని నిలిపేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు భద్రతాపరంగా ఎందుకు అప్రమత్తంగా లేరనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ పర్యటనకు రెండు రోజుల ముందే అక్కడ పర్యటించిన పోలీసులు శనివారం దుకాణాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. మరి అప్పుడే భద్రతాపరంగా ఎక్కడెక్కడ సమస్యలున్నాయో ఎందుకు గుర్తించలేదు? జగన్‌పై రాయి విసిరినప్పుడు విద్యుత్తు సరఫరా లేదు. అలాంటప్పుడు భద్రతా సిబ్బంది ఫోకస్ లైట్లు వేసి వారికి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కనిపించేలా చూసుకోవాలి. కానీ అదీ చేయలేదు. ముఖ్యమంత్రి బస్సుపై నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు చుట్టూ ఉండే భద్రతా సిబ్బంది డేగకళ్లతో అన్ని వైపులా గమనిస్తుండాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే రక్షణ వలయంగా ఏర్పడి కాపాడాలి. రాయి దూసుకొస్తున్నట్లు తెలుస్తున్నా అది సీఎంకు తగలకుండా చేయలేదు.
రాష్ట్రంలో అత్యున్నత స్థాయి భద్రత ఉండేది ముఖ్యమంత్రికే. అలాంటి వీఐపీకి రాయి తగలితే భద్రతా సిబ్బంది, పోలీసులు దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ముందు వీఐపీ చుట్టూ వలయంగా ఏర్పడి స్టోన్‌గార్డులు, బుల్లెట్‌ప్రూఫ్ షీట్లు తెరవాలి. వీఐపీని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలి. రాయి తగిలినా సీఎం చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడలేదు. రాయి వచ్చిన వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముడితే రాయి విసిరినవారిని పట్టుకునేందుకు అవకాశం ఉండేది. కానీ అక్కడ ఉండే వందల మంది సిబ్బంది ఎవరూ ఈ దాడిని గుర్తించలేదు, తక్షణం స్పందించలేదు.