School Holidays in AP :బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు కంట్రోల్‌రూమ్స్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్ష సూచన దృష్ట్యా తిరుపతి, చిత్తూరు కలెక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు తిరుపతికి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందనే వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈవో పేర్కొన్నారు. 2021లో భారీ కొండ చరియలు విరిగి పడిన ఘటనతో టీటీడీ 700 పేజీల విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. ఈ ప్రణాళిక బాగుందనీ, మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అధికారులకు శ్యామలరావు సూచించారు.
TTD on Heavy Rains in AP :ఈఓ స్థాయిలో విపత్తుల నివారణ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడిషనల్ ఈఓ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సమన్వయ కమిటీ ఉందని శ్యామలరావు వివరించారు. అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖ, విజిలెన్స్ విభాగం, ఇతర కీలకమైన శాఖల విభాగాధిపతులు, తమ సిబ్బందితో డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో సూచించారు.